నేడే ఫలితాలు

11 Dec, 2018 01:12 IST|Sakshi

తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

31 జిల్లాల్లోని 43 కేంద్రాల్లో కౌంటింగ్‌

ఉదయం 9 తర్వాత రౌండ్లవారీగా ఫలితాలు

మధ్యాహ్నానికల్లా గెలుపోటములపై స్పష్టత

38 కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌లో గందరగోళం

పోలైన ఓట్లు తీయకుండానే మాక్‌పోలింగ్‌: రజత్‌ కుమార్‌

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలోనూ నేడే కౌంటింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: మూడు నెలలుగా తెలంగాణతోపాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంల్లో నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదల కానున్నాయి. వచ్చే ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణలోని 31 జిల్లాల్లోని 43 లెక్కింపు కేంద్రాల్లో 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 42 రౌండ్లలో లెక్కింపు జరగనుండగా, అత్యల్పంగా భద్రాచలం, అశ్వరావుపేట నియోజకవర్గాల్లో 12 రౌండ్లలో జరగనుంది. ఒక్కో టేబుల్‌ వద్ద పర్యవేక్షకులు, వారి సహాయకులను ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ద్వారా నియమించనున్నారు. 3,356 మంది కౌంటింగ్‌ సిబ్బందితో పాటు 1,916 సూక్ష్మ పరిశీలకులు లెక్కింపు ప్రక్రియలో పాల్గొననున్నారు. తొలి రౌండ్‌లో పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత తదుపరి రౌండ్లలో ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల కల్లా 3,4 రౌండ్లలో 60 వేల నుంచి 70 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ సోమవారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ వివరాలను వెల్లడించారు. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు సర్వం సిద్ధం చేశామన్నారు.

భద్రత కట్టుదిట్టం 
పోలింగ్‌ కేంద్రంలో ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్ల క్యాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రాల్లోపలకు అనుమతించబోమన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్లను బయటకు పంపే ప్రసక్తే లేదన్నారు. రిటర్నింగ్‌ అధికారి టేబుల్‌ మీదే పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారన్నారు. కౌంటింగ్‌ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో 20 వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతోపాటు 20 వేల మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఈవీఎంలలో వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు 238 మంది  ఇంజనీర్లు సిద్ధంగా ఉంటారని రజత్‌కుమార్‌ పేర్కొన్నారు.

గడువులోగా దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బంది అందరికీ పోస్టల్‌ బ్యాలెట్లను పోస్టు ద్వారా పంపించామన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు అందలేదని ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామని, చాలా వరకు గడువు తర్వాత దరఖాస్తు చేసుకోవడంతో వారికి పోస్టల్‌ బ్యాలెట్లు రాలేదన్నారు. ఫారం 12 సమర్పించిన 44,258 మంది ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్లు జారీ అయ్యాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చింతమడక, ఎర్రవల్లి రెండు గ్రామాల్లో ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఫిర్యాదుపై రజత్‌కుమార్‌ స్పందించారు. రెండు చోట్ల ఓటు కలిగి ఉండడం నేరం కాదని, రెండు ఓట్లు వేయడం నేరమన్నారు. 

నాలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠే 

మధ్యప్రదేశ్‌లో (230 స్థానాలు), రాజస్తాన్‌ (199), ఛత్తీస్‌గఢ్‌ (90), తెలంగాణ (119), మిజోరం (40)ల్లో నవంబర్, డిసెంబర్‌ నెలల్లో జరిగిన ఎన్నికలకు కూడా మంగళవారం కౌంటింగ్‌ జరగనుంది. ఈ రాష్ట్రాల్లో మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. ప్రధాన రాజకీయ పార్టీలకు ఈఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా మారాయి. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. మిజోరం మినహా మిగిలిన చోట్ల అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తుండగా.. ఈ రాష్ట్రాల్లో పట్టుసంపాదించాలని కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నించింది.

38 కేంద్రాల్లో అయోమయం 

ఈవీఎంల పనితీరును పరీక్షించేందుకు పోలింగ్‌ ప్రారంభానికి ముందు నిర్వహించే మాక్‌ పోలింగ్‌లో గందరగోళం తలెత్తిందని రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు. మాక్‌ పోలింగ్‌లో నమోదైన ఓట్లతో పాటు వాస్తవ ఓటింగ్‌ ప్రక్రియలో ఓటర్లు వేసిన ఓట్లు కలిసిపోయాయని అన్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు మరిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. ఈ పోలింగ్‌ కేంద్రాల ఓట్ల లెక్కింపు విషయంలో ఏం చేయాలన్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సలహా కోరామని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌లోని ఉమామహేశ్వర్‌ కాలనీలో ఓటర్లపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జీ చేయడంతో చందూనాయక్‌ అనే ఓటరు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై విలేకరుల ప్రశ్నలకు రజత్‌కుమార్‌ స్పందిస్తూ.. ఈ ఘటనపై పోలీసు శాఖ నుంచి నివేదిక కోరుతామన్నారు. 2కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా ఓటేశారని.. ఈ ఒక్క ప్రాంతంలో ఏం జరిగిందనేది ఇంత వరకు తన దృష్టికి రాలేదన్నారు.

వివిధ జాతీయ చానళ్లు, సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ వివరాలివీ

మరిన్ని వార్తలు