రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌

12 Dec, 2018 03:28 IST|Sakshi
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాతో కార్యకర్త సంబరం

ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ హస్తగతం... మధ్యప్రదేశ్‌లో హంగ్‌!

ఎంఎన్‌ఎఫ్‌ చేతికి మిజోరం

నాలుగురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో ఓటమిపాలైంది. మూడుసార్లు బీజేపీకే పట్టంగట్టిన ఛత్తీస్‌గఢ్‌ ప్రజలు ఈసారి రమణ్‌సింగ్‌ సర్కారును గద్దెదించారు. దీంతో 90 స్థానాల్లో బీజేపీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. అటు రాజస్తాన్‌లోనూ సీఎం వసుంధరా రాజేపై ఉన్న వ్యతిరేకత కారణంగా కమలం పార్టీ 70 స్థానాలకే పరిమితమయ్యింది. ఇక్కడ కాంగ్రెస్‌ 100 స్థానాల్లో గెలుపొంది అధికారానికి అడుగుదూరంలో నిలిచింది. అయితే 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ బీజేపీ (109), కాంగ్రెస్‌ (113) మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నెలకొంది. హంగ్‌ వచ్చే సంకేతాలుండటంతో.. ఎస్పీ, బీఎస్పీ, ఇతరుల ఓట్లను పొందేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అటు 40 స్థానాలున్న మిజోరంలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోగా.. ప్రాంతీయ పార్టీ ఎంఎన్‌ఎఫ్‌ 26 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.  

న్యూఢిల్లీ: రాజకీయ సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కట్టబెట్టి కాంగ్రెస్‌కు మోదాన్ని, మూడు ప్రధాన రాష్ట్రాల్లో తీవ్రంగా నష్టపరిచి బీజేపీకి ఖేదాన్ని ఈ ఎన్నికలు మిగిల్చాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు, మిజోరంలో మిజో నేషనల్‌ ఫ్రంట్‌కు ఘన విజయం అందించాయి. ఈ అసెంబ్లీ ఫలితాలతో రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్, వ్యూహాల్లో మార్పులతో బీజేపీ లోక్‌సభ ఎన్నికల రణరంగంలో దూకనున్నాయి.

ఇప్పటివరకు రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో బీజేపీ అధికారంలో ఉండగా, తాజాగా రాజస్తాన్, చత్తీస్‌గఢ్‌ల్లో పరాజయం పాలైంది. రాజస్తాన్‌లో మొత్తం 200 స్థానాలకు గానూ 199 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్‌ 99 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 73, బీఎస్పీ 6, సీపీఎం 2, భారతీయ ట్రైబల్‌ పార్టీ 2, రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ 3, ఇండిపెండెంట్లు 13 స్థానాల్లో గెలుపొందారు. విజయం సాధించిన ఇండిపెండెంట్లలో అత్యధికులు కాంగ్రెస్‌ రెబెల్సే కావడం విశేషం.

దాంతో మేజిక్‌ నెంబరైన 100ను సాధించడం కాంగ్రెస్‌కు కష్టమేం కాదు. అలాగే, చత్తీస్‌గఢ్‌లోని మొత్తం 90 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 68 సీట్లు సాధించి కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఇక్కడ బీజేపీ 15 స్థానాలకే పరిమితమయింది. అజిత్‌ జోగి, మాయవతి కూటమికి 6 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రం కౌంటింగ్‌ సందర్భంగా మొదటి రౌండ్‌ నుంచి ఉత్కంఠభరిత పోరు నెలకొంది. రౌండ్, రౌండ్‌కీ కాంగ్రెస్, బీజేపీల మధ్య ఆధిక్యతలో హెచ్చుతగ్గులు వస్తూ, పార్టీ నేతలకు, అభ్యర్థులకు చెమటలు పట్టించాయి.

మొత్తం 230 స్థానాల అసెంబ్లీలో ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు అర్ధరాత్రి వరకు చెరి 78 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్‌ 36, బీజేపీ 31 సీట్లలో ఆధిక్యతలో ఉన్నాయి. బీఎస్పీ 2, ఎస్పీ 1, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. హంగ్‌ తప్పని ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నేతలు మంగళవారం రాత్రి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈశాన్య రాష్ట్రం మిజోరంను కూడా కాంగ్రెస్‌ తమ ఖాతా నుంచి చేజార్చుకుంది. ఇక్కడ మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 26 సీట్లతో ఘనవిజయం సాధించింది. మొత్తం 40 సీట్లలో కేవలం 5 స్థానాల్లోనే కాంగ్రెస్‌ గెలుపొందింది.

థాంక్యూ భారత్‌
రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో ప్రజలు ఇచ్చిన తీర్పుకు కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం తన అధికారిక ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపింది. మీరు ద్వేషానికి బదులు ప్రేమను ఎన్నుకున్నారని ఆనందం వ్యక్తం చేసింది. ‘ప్రజాస్వామ్యం గెలిచింది! భారత ప్రజానీకానికి కృతజ్ఞతలు. ప్రజలు ద్వేషానికి బదులు ప్రేమను, హింసకు బదులు అహింసను, అబద్ధానికి బదులు నిజాన్ని ఎంచుకున్నారని’ అని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది.

మోదీ నుంచి ఎంతో నేర్చుకున్నా!
ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. గెలిచిన నేతలకు అభినందనలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో, ఆ తరువాత తానెంతో నేర్చుకున్నానని, అలాగే, ఎలా ఉండకూడదో, ఏం చేయకూడదో ప్రధాని మోదీ నుంచి నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. ప్రజలు నిరుద్యోగానికి, అవినీతికి, రైతాంగ సంక్షోభానికి వ్యతిరేకంగా ఓటేశారన్నారు.

గెలుపోటములు సహజం
ఈ ఎన్నికల్లో విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ప్రజా తీర్పును వినమ్రంగా స్వీకరిస్తామన్నారు. జీవితంలో గెలుపు, ఓటమి సహజమని, వాటికి అతీతంగా దేశాభివృద్ధి కోసం పనిచేస్తామని పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు