ఓటు.. ఐదు రకాలు

28 Mar, 2019 13:12 IST|Sakshi

సాక్షి, అచ్చంపేట : ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతీ పౌరుడికీ రాజ్యాంగం ఓటుహక్కు కల్పించింది. ఓటు ద్వారానే ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. అయితే ఓటును ఐదు రకాలుగా విభజించారు. ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. టెండర్‌ ఓటు, సాధారణ ఓటు, సర్వీస్‌ ఓటు, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉంటాయి.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు 
ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఓటర్లే. ఎన్నికల సమయంలో వీరు ఎన్నికల విధులు నిర్వహిస్తారు. వీరు కూడా ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు బ్యాలెట్‌ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ను తపాలా శాఖ ద్వారా పంపించి ఓటు హక్కును వినియోగించుకుంటారు.

మరికొందరు పోలింగ్‌ ముందు రోజే ప్రత్యేకంగా ఉద్యోగుల కోసం పోస్టల్‌ పోలింగ్‌ను ఏర్పాటు చేసి ఓటు వేయిస్తారు. ఓట్ల లెక్కింపు అయిన తర్వాత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో సందర్భంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే అభ్యర్థుల గెలుపులో కీలకంగా మారుతాయి. 

టెండరు ఓటు.. 
ఓటరు జాబితాలో ఓటుహక్కు ఉన్న వ్యక్తి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసేటప్పుటికే ఆ వ్యక్తి ఓటును మరొకరు వేసినా.. సదరు వ్యక్తి ఓటు వేయవచ్చు. ఇందుకోసం రిటర్నింగ్‌ అధికారి వద్ద తాను ఓటు హక్కును వినియోగించుకోలేదని నిరూపించాలి. పోలింగ్‌ అధికారి హామీతో ఓటును వినియోగించుకోవచ్చు. దీన్నే టెండరు ఓటు అంటారు.

సాధారణ ఓటు.. 
దేశంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు అన్ని రకాల ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కలిగి ఉండాలి. ఇదే సాధారణ ఓటు. 18 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ ఓటు హక్కును పొందేందుకు అర్హులు. ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఆధారాలు చూపిస్తే ఓటుహక్కు కల్పిస్తారు. 

సర్వీస్‌ ఓటు.. 
సైనికుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వీసు ఓటు వేసే అవకాశం కల్పించింది. ఎన్నికల సమయంలో సైన్యంలో విధులు నిర్వహించే సైనిక ఉద్యోగులు ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉంటారు. సైన్యంలోని ప్రధాన అధికారి ద్వారా/ తపాలా శాఖ ద్వారా ఓటు పంపించవచ్చు. ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ద్వారా కూడా పంపవచ్చు. 

ప్రవాస భారతీయులకూ..
ఈసారి జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రవాస భారతీయులకు కూడా ఓటు హక్కు పొందేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో ఫారం–6ఏ ద్వారా దరఖాస్తు చేసుకుని తగిన ఆధారాలు చూపించి ఓటు హక్కును పొందవచ్చు. ఓటు హక్కును పొందిన ప్రవాస భారతీయుల ఆసక్తి మేరకు విదేశాల నుంచి వచ్చి తమ ప్రాంత ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు