ఇలాంటి పాలన వద్దే వద్దు..

10 Apr, 2019 12:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఐదేళ్ల చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలపై సామాన్యులు, పేదలు, యువత, మహిళలు, రైతులే కాకుండా మాజీ ఉన్నతాధికారులు, మాజీ న్యాయమూర్తులు, విద్యావంతులు, పర్యావరణవేత్తలు ఇలా అన్ని రంగాల ప్రముఖులు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూల చూసినా అక్రమాలు, అరాచకాలేనని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు తన వర్గం వారే తప్ప బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పట్టదని, రాష్ట్రంలో ప్రకృతి వనరుల్ని అడ్డంగా దోచేశారని తూర్పారా బట్టారు. ఈ అవినీతి పరంపరపై పలువురు ప్రముఖులు ఎవరెవరు ఏమన్నారంటే..  

చంద్రబాబుకు విలువలు లేవు 

కాంగ్రెస్‌లో పుట్టి పెరిగిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆయనను మించిన అవినీతిపరుడు, అసమర్ధుడు, వెన్నుపోటుదారుడు ఎవరున్నారు? ఇంకొకర్ని విమర్శించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు? ఆయన పెద్ద జాదూ.. అన్ని కులాలను, మతాల్ని మోసం చేశాడు. వాజ్‌పేయితో కలుస్తానంటే ఆ వేళ ముస్లింలు వద్దన్నారు. అయినా బీజేపీతో చేతులు కలిపాడు. ఆ తర్వాత అవే మసీదుల్లో మీటింగులు పెట్టి.. నన్ను క్షమించండి, మరెప్పుడూ కలవనన్నాడు. మళ్లీ మోదీతో కలిశాడు. వంగి వంగి దండాలు పెట్టాడు. ఇప్పుడు తిడుతున్నాడు. నిన్నటి దాకా రాహుల్‌ గాంధీని, సోనియా గాంధీని తిట్టి ఇప్పుడు వాళ్లకు దండాలు పెడుతున్నాడు. ప్రత్యేక హోదాలో ఏముందీ? అన్నది చంద్రబాబే. ప్యాకేజీయే మంచిదని చెప్పాడు. మళ్లీ నల్లచొక్కా వేసుకుని హోదా కావాలంటున్నాడు.                  
- పోసాని కృష్ణమురళీ, సినీనటుడు  

ముస్లింలను బాబు వంచించారు

ముస్లింలను నిలువునా వంచించిన వ్యక్తి చంద్రబాబునాయుడు. బాబు పాలనలో మైనారిటీలు ఎప్పుడూ సంతోషంగా లేరు. గుజరాత్‌ అట్టుడికిపోతూ అమాయక ముస్లింలు ఊచకోతకు గురైతే.. ముసిముసి నవ్వులు నవ్విన వ్యక్తి చంద్రబాబు. హైదరాబాదీ ముస్లిం యువకులను గుజరాత్‌ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి జైళ్లలో పెడితే చంద్రబాబు ఏం చేశారు. నాటి ప్రధాని వాజ్‌పేయీ, గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీలకు తన మౌనంతో బాసటగా నిలిచి.. ముస్లింలను దగా చేసింది చంద్రబాబు కాదా? వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను ప్రకటించి అమలు చేశారు. అది ఎంత మేలు చేసిందో ముస్లింలు కళ్లారా చూశారు. ఆ ఫలాలు అనుభవించిన ఎంతోమంది ఉన్నత స్థితికి చేరుకున్నారు. అలాంటి మహానేత కుమారుడిగా వైఎస్‌ జగన్‌ను వారు అవే కళ్లతో చూస్తున్నారు. కచ్చితంగా ముస్లిం సమాజం అంతా జగన్‌కు అండగా నిలవాలి, నిలుస్తుంది కూడా! ప్రతి ముస్లిం కుటుంబం కూడా వైఎస్‌ను తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు.  జగన్‌ను కూడా అలానే భావిస్తున్నారు.      
- అసదుద్దీన్‌ ఒవైసీ, ఎంఐఎం  అధినేత

ఇరిగేషన్‌ అంతా పెద్ద స్కాం 

ఓట్ల కోసమే ఎన్నికల ముందు వివిధ కులాలు, వర్గాలకు కార్పొరేషన్ల ఏర్పాటును చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఒక సామాజికవర్గం మేలు కోసం తప్ప సీఎంగా ఆయన చేస్తున్నదేమీ లేదు. టీడీపీ నాయకులు కాగితాలపైన కంపెనీలు సృష్టించి విలువైన భూములు కబ్జా చేశారు. డ్వాక్రా సంఘాల ముసుగులో అడ్డగోలుగా ఇసుకను అమ్ముకుని వేల కోట్లు దండుకున్నారు. కేంద్రం చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును తీసుకుని దాన్ని ఏ రకంగానూ ముందుకు పోనీయకుండా చేశారు. కాంట్రాక్టర్లకు భారీ లాభాలు వచ్చేలా చేసి.. ఇష్టమొచ్చినట్లు సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చేశారు. ఇరిగేషన్‌ ఒక పెద్ద స్కామ్‌. ‘నాకేంటి?’ అన్న తరహాలో బాబు ఆలోచన ఉంటుంది. ప్రగతి సాధించలేక వైఫల్యాన్ని వేరొకరిపై నెట్టేందుకు నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట దీక్షలు చేశారు. రాష్ట్రంలో ఈ అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క ఓడరేవు కట్టారా?       
- ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి 

ఎన్నికల సమయంలోనే ఈ గిమ్మిక్కులేంటి?

సరిగ్గా ఎన్నికల సమయంలో పథకాల పేరుతో డబ్బుల్ని జమ చెయ్యడమేంటి.  ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల పాటు పనిచేసిన కూలీలకు రూపాయి కూడా ఇవ్వలేదు. చెమటోడ్చి పనిచేసిన వారికి నెలకు రూ.10 వేలపైనే రావాల్సి ఉండగా.. వాటిని ఇవ్వకుండా పసుపు–కుంకుమ అంటూ.. రూ.10 వేలు ఇవ్వడం ఏం న్యాయం. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే.  ఇటీవల సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో సుమారు 15 మంది ఐఏఎస్‌లకు అప్పనంగా స్థలాలు కట్టబెట్టారు. ఎందుకిలా ఇచ్చారు, రైతుల వద్ద నుంచి భూములు లాక్కున్నది ఐఏఎస్‌లకు ఇచ్చేందుకా. ఎంత దారుణం.  
– ఈఏఎస్‌ శర్మ, విశ్రాంత ఐఏఎస్‌ 

ఎక్కడ చూసినా అవినీతి, బంధుప్రీతి 

అక్రమ సొమ్ముతో ఎమ్మెల్యేలను ఇష్టమొచ్చినట్లు కొన్నారు. ప్రజాతీర్పుకు విలువ లేకుండా చేశారు. ఓటుకు పది వేలు ఇచ్చేందుకు సైతం సిద్ధమంటున్నారు. అధికారులను బెదిరించి, భయపెట్టి పార్టీ కార్యకర్తల్లా మార్చేశారు.  గత ఐదేళ్లలో పార్టీయే ప్రభుత్వం, ప్రభుత్వమే పార్టీ అన్నట్లుగా వ్యవహరించారు. నయానో భయానో అధికారులను తమ దార్లోకి తెచ్చుకున్నారు. ఫలానా పనికి ఫలానా రేటంటూ వాటాలు పంచుకున్నారు. కాంట్రాకర్లకు బిల్లులు చెల్లించాలంటే.. లంచం ఇవ్వాల్సిందే. కాంట్రాక్ట్‌ రావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే. మంత్రులు తప్పు చేస్తే ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యమంత్రే తప్పు చేస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి.. ఎవరికి చెప్పుకోవాలి..? రాజధాని కోసం మూడు పంటలు పండే భూములను లాక్కున్నారు. భూములు ప్రభుత్వపరం కాక ముందే.. విదేశీ కంపెనీలకు పందేరం పెట్టారు. 
- జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి  

మోసకారి బాబును నమ్మొద్దు
 

చంద్రబాబు పాలనలో బీసీలకు ఎలాంటి మేలు జరగలేదు. ఇపుడు 5 ఏళ్లు, అంతకు ముందు 9 ఏళ్లు పరిపాలించిండు. గడ్డపారలు, బర్రెలు, గొర్రెలు, సుత్తెలు, బుట్టలు, చిన్నచిన్న కులవృత్తులు చేసుకుంటూ అర్ధాకలితో బతకమని.. ఇవే కదా ఇస్తానన్నాడు. వాళ్లు మంచి ఉద్యోగాలు సంపాదించేందుకు ఏమైనా చేసిండా? కనీసం ఫీజు రీయింబర్స్‌మెంటునైనా పూర్తిగా ఇవ్వలేదు. మారుతున్న సమాజానికి అనుగుణంగా బీసీలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యం జగన్‌కు ఉంది. చంద్రబాబు ఆలోచన ఎంతసేపూ బీసీలు కుల వృత్తులను నమ్ముకొని అలాగే ఎదగకుండా ఉండాలని ఉంది. చంద్రబాబుది అవకాశవాదం. కులాలు, మతాల మధ్య పంచాయితీ పెట్టి పబ్బం గడుపుకోవడం దుర్మార్గం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని గట్టిగా నమ్ముతున్నాం. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టండని చెబితే జగన్‌ చేసి చూపించాడు. ఏపీలో బీసీలంతా తనకు ఓటేస్తారన్న కుయుక్తితో చంద్రబాబు నన్ను వాడుకున్నాడు. బీసీలను ఉపయోగించుకుని సీఎం కాగానే అవసరం తీరాక వదిలేశాడు.  
- ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే  

పోలవరంలో బాబు చేసిందేమీ లేదు 

పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చిందొకరు. జాతీయ ప్రాజెక్ట్‌గా చేసిందొకరు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఖర్చుపెట్టింది మరొకరు. మరి పోలవరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. సింగపూర్‌ తరహాలో రాజధానని పదేపదే చెప్పడం ఆత్మన్యూనతాభావం. భారతీయ ఇంజనీర్ల పర్యవేక్షణలో రాజధాని నిర్మిస్తే మురికివాడలుగా మారుస్తారని చంద్రబాబు పేర్కొనడం ఎంత దారుణం. అమరావతిని రాజధానిగా ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో తన సామాజికవర్గానికి చెందిన బినామీలతో తక్కువ ధరకు భూములు కొనిపించారు. మేకిన్‌ ఇండియాలో భాగంగానే అనంతపురంలో కియో కంపెనీ ఏర్పాటైంది. అది తన ఘనతగా చెప్పుకోవడం సరికాదు. హంద్రీనీవా పూర్తయితే రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. హంద్రీనీవాను పూర్తి చేయకుండా.. చేతులారా రాయలసీమను ఈ  ప్రభుత్వం నాశనం చేసింది.     
- వై.వెంకట్రామి రెడ్డి, ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్‌  

సంపద సృష్టి పెద్ద మాయ 

రాష్ట్రాభివృద్ధిపై బాబు చెప్పేవన్నీ అబద్ధాలు, అర్ధసత్యాలే. సంపద సృష్టి అనేది పెద్ద మాయ. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్నారు. రైతులకు రూ.88 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంటే.. తీరా మాఫీ రూ.15వేల కోట్లకు మించలేదు. బలవన్మరణాలకు పాల్పడే రైతులకు చంద్రన్న బీమా అన్నారు. అదెక్కడ ఇచ్చారో చెప్పండి. 4, 5 తుపాన్లు వస్తే ఎంతమందికి సాయం చేసారు.? ఎందుకు శ్వేతపత్రాన్ని విడుదల చేయలేదు.  2014 ఎన్నికలకు ముందు వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.  ఉద్దానం కిడ్నీ వ్యాధి పీడితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఆచరణలో ఒకే ఒక్క డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే.. అదికూడా  సరిగా పనిచేయడం లేదు. 
- డాక్టర్‌ దొంతిరెడ్డి నరసింహారెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త  

రాష్ట్రాన్ని దోచుకుతిన్నారు 

చంద్రబాబు 14 ఏళ్ల పాలన కుతంత్రాలు, దోపిడీతోనే నడిచింది. సమాజంలో కులాల మధ్య విభేదాలకు బీజం నాటారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలైన వ్యవస్థలను దిగజార్చి, కోర్టు స్టేలతో విచారణ నుంచి తప్పించుకుంటున్నారు. విచారణ జరగకుండా వాయిదాలు వేయించుకున్న మాత్రాన సచ్ఛీలుడైపోరు. ఏదొక రోజు కోర్టు బోను ఎక్కక తప్పదు. కొత్త పార్టీలను మాయచేసి ప్రతిపక్షంపై ఉసిగొల్పుతున్నారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీలోని ద్వితీయ శ్రేణి నేతలు ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. అగ్రిగోల్డ్, సదావర్తి భూములు, విశాఖ భూ కుంభకోణం, అమరావతి అవినీతి భాగోతం.. ఇలా ఇంత తీవ్రమైన అవినీతి ఏపీలో ముందెన్నడూ జరగలేదు. ఇదంతా కేవలం చంద్రబాబు అసమర్ధ, అవినీతి పాలన వల్లే.  
- పి.విజయ్‌బాబు, సమాచారహక్కు చట్టం మాజీ కమిషనర్‌  

చంద్రబాబు పాలనలో అంతులేని అవినీతి
 
రాష్ట్రంలో 35 ఏళ్లలో ఇంత దౌర్భాగ్యమైన పాలన చూడలేదు. రాజధాని నిర్మాణాన్ని సొంత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంగా మార్చుకున్నారు. ఇసుక, మట్టితో సహా సహజ వనరుల్ని అడ్డంగా దోచేశారు. నీరు–చెట్టు, ఉపాధి హామీ అన్నింటా అక్రమాలే. పెండింగులోని సాగునీటి ప్రాజెక్టుల అంచనాలు మూడు రెట్లు పెంచి దోచుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి కి.మి.కు రూ. 17 కోట్ల నుంచి రూ. 26 కోట్లయితే.. అమరావతిలో కి.మీ. రూ. 36 కోట్లు పోస్తున్నారు. ఇంటి నిర్మాణంలో చ.అడుగుకు రూ. 2 వేలు ఖర్చవుతుంటే అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణంలో చ.అడుగుకు రూ. 11,000 ఖర్చు పెట్టారు. ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేని పోలవరం ప్రాజెక్టు విహారయాత్రలకు రూ. 400 కోట్లు దోచిపెట్టారు. మితిమీరిన దుబారా, అక్రమాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. పీఎంఏవై ఇళ్లకు పక్క రాష్ట్రంతో పోల్చితే మన వద్ద చ.అడుగుకు రూ. వెయ్యికి పైగా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. 36.5 కోట్ల చదరపు అడుగులకు ఎంత అవినీతి జరుగుతుందో చూడండి. రాజధానిలో శిలాఫలకాలు, సభలు, ఆర్భాటాల కోసం రూ. 350 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోనూ, అమరావతిలోనూ రెండు చోట్ల క్యాంపు ఆఫీసులకు సొబగులు, ఫాంహౌస్‌ల హంగులకు వందల కోట్లు వృథా చేశారు.   
- అజేయకల్లం, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి 

అర్చకుల కడుపు కొట్టారు

వంశపారంపర్య హక్కుల్లో అర్చకులకు పదవీ విరమణ లేదని సుప్రీం, హైకోర్టులు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా పదవీ విరమణను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 వేల ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, వారి కుటుంబాలు దుర్భర స్థితిలో ఉన్నాయి.  టీడీపీ హయాంలో అర్చకులకు ఎలాంటి గౌరవ, మర్యాదలు లేక చాలా కష్టాలు పడుతున్నారు.  2017 డిసెంబర్‌లో మరమ్మతుల పేరిట 25 రోజులు పోటును మూసివేసి లోపల గోడల్ని పగులగొట్టారు.  పోటు వద్ద పల్లవులు, చోళులు, పాండ్యులు, మరికొందరు రాజులు ఇచ్చిన ఆభరణాలు ఉన్నాయని తెలుసుకుని ఈ తవ్వకాలు జరిపారు. వెయ్యికాళ్ల మండపం కూల్చివేసిన సమయంలో భోషాణాల్లో ఆభరణాలు లభ్యమైనట్టు తెలిసింది.
– రమణ దీక్షితులు, టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు  

విశాఖలో రూ. లక్ష కోట్ల కుంభకోణం 

విశాఖలో హుద్‌హుద్‌ బీభత్సం కంటే ఈ ఐదేళ్లలో నగరానికి భూబకాసురులు కోలుకోలేనంత నష్టం చేకూర్చారు. ఉత్తరాంధ్రను టీడీపీ సర్కారు పూర్తిగా దగాచేసింది. మళ్ళీ ఈ పాలకులే వస్తే ఇక్కడి వనరులు మొత్తాన్ని ఊడ్చేస్తారు. విశాఖ జిల్లాలో జరిగిన భూ దోపిడీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. రూ.లక్ష కోట్ల భూ కుంభకోణమని పత్రికలే రాశాయి. మునుపెన్నడూ లేనివిధంగా విశాఖ జిల్లాలో సహజ, ఇంధన వనరుల్ని దోచేశారు. రాష్ట్రంలో ప్రాథమిక రంగాలైన విద్య, వైద్య వ్యవస్థల్ని నాశనం చేశారు. పసుపు కుంకుమ పేరిట ఎన్నికలకు ముందు డబ్బులు జమ చేయడమేంటి...? ఇది ఎన్నికల తాయిలం కాదా? ఈ ఐదేళ్ళ నుంచి ఎందుకు చేయలేదు.?  
- కేఎస్‌ చలం, యూపీఎస్సీ మాజీ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌  

దారుణంగా ఇసుక దోపిడీ
 

ఏపీలో ఇసుకను రాజకీయ మాఫియా దోచుకుంటోంది. కృష్ణా, గోదావరి నదుల్లో ఇసుకను అధికార పార్టీ దోచేస్తోంది. రాష్ట్రమంతా అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ దందాలో అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారు. సీఎం నివాసానికి సమీపంలోనే ఇసుక దోపిడీ సాగుతోంది. ఈ దోపిడీపై విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను.   
- రాజేందర్‌ సింగ్, ప్రముఖ పర్యావరణవేత్త 


ఇష్టారాజ్యంగా అంచనాల పెంపు 
పట్టిసీమ ఎత్తిపోతల్లో రూ.374 కోట్లు దోచేశారు. పోలవరం ప్రాజెక్టులో అంచనాలు పెంచి కాంట్రాక్టర్లకు రూ.1853 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు. రాష్ట్రంలోని 44 సాగునీటి ప్రాజెక్టుల అంచనా వ్యయాన్ని ఏకంగా రూ. 27,403.74 కోట్లకు పెంచేసి.. ఒక్కటీ పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుల తొలి అంచనా వ్యయం రూ.49,107.78 కోట్లు కాగా, 2017 మార్చి 31 నాటికి పూర్తి చేస్తామన్నారు. అది పూర్తి చేయకపోగా అంచనా వ్యయాన్ని రూ.76,511.52 కోట్లకు పెంచారు.  
 – కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ( కాగ్‌)  

డిస్కంలను ముంచేస్తారా?.. సీఎస్‌ దినేష్‌  అభ్యంతరం

రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భారీ విద్యుత్‌ కొనుగోలు కుంభకోణానికి తెరతీయగా.. అప్పటి సీఎస్‌ దినేశ్‌ కుమార్‌ అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యమంత్రి మాత్రం ఆ అంశాన్ని కేబినెట్‌లో పెట్టి రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉందని.. ఈ దశలో ఎక్కువ ధరకు సుజ్లాన్‌ అనే ప్రైవేట్‌ సంస్థ నుంచి పవన విద్యుత్‌ కొనుగోలు అవసరం లేదని సీఎస్‌ దినేశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఏడాదికి డిస్కమ్స్‌ రూ.2000 కోట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయని.. ఈ సమయంలో పవన విద్యుత్‌ను యూనిట్‌ రూ.4.84 పైసలకు కొనుగోలుకు ఒప్పందం చేసుకోవడంపై అభ్యంతరం తెలిపారు. రూ.3.46 పైసలకే ఇచ్చేందుకు ప్రైవేట్‌ సంస్థలు ముందుకు వచ్చాయన్న అంశాన్ని గుర్తు చేశారు.  

సీఎస్‌ టక్కర్‌ నిరాకరణ.. చట్టాన్నే మార్చేసిన సీఎం 
రాజధాని నిర్మాణం కోసం సింగపూర్‌ కంపెనీల ప్రతిపాదనల్ని సీఆర్‌డీఏ అధ్యయనం అనంతరం సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీకి పంపాలి. అందుకు విరుద్ధంగా ఆర్థిక మంత్రి నేతృత్వంలోని మంత్రుల కమిటీ, సీఎం ఆమోదం అనంతరం ప్రతిపాదనల్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీకి పంపారు. దీనిపై సీఎస్‌ టక్కర్‌ తీవ్రంగా స్పందించారు. సీఎం, మంత్రుల కమిటీ ఆమోదం తెలిపితే.. అప్పుడు ఆ ప్రతిపాదనల్ని మంత్రివర్గానికి పంపాలని, అధికారులతో కూడిన అథారిటీకి కాదన్నారు. శాఖలన్నీ ఫైలుపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని సీఎస్‌ టక్కర్‌ స్పష్టం చేయడంతో చంద్రబాబు ఏకంగా చట్టాన్నే మార్చేశారు. ఆ చట్టంలో సీఎస్‌ నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ కి అధికారాలు తొలగిస్తూ ఏకంగా సవరణలు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇదే అంశంపై హైకోర్టులో పిల్‌ దాఖలుకాగా.. విచారణకు స్వీకరించిన హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  

ఏపీలో చెత్తపాలన 

బిహార్‌తో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. బిహార్‌లో మ్యూజియం నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకుని సకాలంలో పూర్తి చేశాం. ఎక్కడా ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు. ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి మేం ఇచ్చిన డిజైన్లు ఎంపికచేశామన్నారు. తర్వాత ఇష్టానుసారంగా సూచనలిచ్చారు. సీఆర్‌డీఏ స్వతంత్రంగా పనిచేయడం లేదు. నేతల రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడమే తప్ప తామేం చేయలేమని సీఆర్‌డీఏ ఉద్యోగుల సంభాషణల్లో మాకు తెలిసింది. ఏపీలో చెత్తపాలన సాగుతోంది.      
- పుమిహికో, మాకీ అసోసియేట్స్‌ 

చంద్రబాబు బీసీ, కాపు వ్యతిరేకి

చంద్రబాబు బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకి. బీసీలు, ఎస్సీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాపులకు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్‌ న్యాయస్థానాల్లో నిలవదని బాబుకు కూడా తెలుసు. కాపులపై ఆయనకు చిత్తశుద్ధిలేదు.  ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, ఒక బ్రాహ్మణుడిని న్యాయమూర్తులుగా సిఫార్సు చేసినప్పుడు.. వాళ్లందర్నీ తిరస్కరిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్రానికి లేఖ రాశారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వాళ్లు న్యాయమూర్తులు కాకూడదన్నది చంద్రబాబు లెక్క. వాళ్ల(చంద్రబాబు) అడుగులకు మడుగులొత్తే వాళ్లే కావాలి. కాపులకు రిజర్వేషన్‌పై మంజునాథ్‌ కమిషన్‌ వేశారు. మంజునాథ్‌ నివేదిక ఇవ్వడానికి ముందే కమిషన్‌లో ముగ్గురు సభ్యులను చంద్రబాబు మేనేజ్‌ చేసి.. రాత్రికి రాత్రి వారితో ఒక రిపోర్టు రాయించుకుని, చైర్మన్‌ను పక్కన పెట్టారు. 
- జస్టిస్‌ ఈశ్వరయ్య, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు