విజయవాడలో కలకలం: టీడీపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీ

5 Jul, 2018 13:47 IST|Sakshi

సాక్షి, విజయవాడ: అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా విజయవాడలో వెలిసిన ఫ్లెక్సీలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. టీడీపీ తీరుకు నిరసనగా గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాత్రికి రాత్రికి ప్రత్యక్షమైన ఈ హోర్డింగ్‌లతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ఫ్లెక్సీ ఏర్పాటుపై అధికార పార్టీ నేతలకు సమాచారం అందడం.. అనంతరం మున్సిపల్‌ సిబ్బందితో వాటిని తొలగించడం చకాచకా జరిగిపోయాయి.  

ఫ్లెక్సీలో ఏముందంటే..?
ప్రజలారా ఆలోచించడంటూ.. ‘కేంద్రం ఇచ్చిన స్పెషల్‌ ప్యాకేజీ నిధులు తీసుకుంటూ.. యూ టర్న్‌ తీసుకొని మళ్లీ హోదానే కావాలని అడగటంలో ఆంతర్యం ఏమిటో 5 కోట్ల ఆంధ్రులకు తెలుసులే!.. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులలో వేల కోట్ల రూపాయల అవినీతి జరగడం నిజం కాదా?.. తెలుగు దేశం తమ్మూళ్లూ.. పోలవరం, పట్టిసీమ, రాజధాని భూముల కేటాయింపులపై సీబీఐ విచారణ కోరదామా? కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇళ్లు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం ఎంత వరకు కరెక్టు!.. కాల్‌ మనీ కేసుల విచారణ ఏమైంది..? ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 హామీలు ఏమయ్యాయి తెలుగుదేశం తమ్మూళ్లూ! కులాల మధ్య చిచ్చు పెట్టింది మీరు కాదా తెలుగు దేశం తమ్మూళ్లూ?’ అని 5 కోట్ల మంది ఆంధ్రులు అని భారీ  ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై స్పష్టత రాలేదు. కానీ ఈ బీజేపీ శ్రేణులే ఏర్పాటు చేశాయని టీడీపీ ఆరోపిస్తోంది. 

కాగా, గత కొంతకాలంగా నగరంలో బీజేపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీ ఫైట్‌ కొనసాగుతోంది. మూడు నెలల క్రితం కేంద్రంతో పాటు, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా టీడీపీ నేత కాట్రగడ్డ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. విజయవాడలోనే ప్రత్యక్షమైన ఈ ఫ్లెక్సీల్లో కేంద్రం, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన ఆ హోర్డింగ్‌లపై అప్పట్లో బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే బయటకు బీజేపీపై విమర్శలు చేస్తూ అంతర్గతంగా బీజేపీతో అంటకాగుతున్న సీఎం చంద్రబాబు ఈ ఫ్లెక్సీలపై మండిపడ్డారు. మోదీని ఎవరూ దూషించొద్దని తెలుగు తమ్ముళ్లకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని సొంత పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్షాలు గర్హిస్తున్నాయి.


ఫ్లెక్సీని తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది..


గతంలో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

మరిన్ని వార్తలు