ఫ్లెక్సీలపై.. రగడ

2 Oct, 2017 16:07 IST|Sakshi
విజయ దశమి ముందు రోజు నారా లోకేష్‌ పర్యటన సందర్భంగా వేసిన ఫ్లెక్సీని తొలగిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

విజయనగరం ఉత్సవాల్లో ఫ్లెక్సీల ఏర్పాటుపై రాజకీయ పార్టీల మధ్య స్పర్ధలు

వైఎస్సార్‌ సీపీ నాయకులు ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నాయకుల యత్నాలు

రెండు పార్టీల నేతల మధ్య నలిగిపోతున్న అధికారులు

జాతర తర్వాత ఫ్లెక్సీలపై నిర్ణయం @ టీపీఓ హరిదాసు

విజయనగరం మున్సిపాలిటీ : ప్రచారంపై ఉండే ఆరాటం రాజకీయ పార్టీల మధ్య స్పర్ధలకు కారణం అవుతోంది. దీనికి ప్రస్తుతం విజయనగరం వేధికగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం ఉత్సవాలు, పైడి తల్లమ్మ ఉత్సవాలకు జిల్లా కేంద్రం ప్రస్తుతం ఆతిథ్యం ఇస్తోంది. ఈ నెల 1 నుంచి 3 వరకు ఈ రెండు ఉత్సవాలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. విజయనగరం ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కాగా, పైడతల్లి ఉత్సవాలు సోమవారం ఆరంభం కానున్నాయి. ఏటా ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. సిరిమానోత్సవం రోజే 2.5 లక్షల మంది వస్తారని అంచనా. మిగిలిన రోజుల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని సమాచారం.

పార్టీల మధ్య రగడ..
అయితే ప్రచారం విషయంలో టీడీపీ ఈ మధ్యకాలంలో వెనుకబడింది. వైఎస్సార్‌ సీపీ నాయకుల ఫొటోలతో వెలసిన అమ్మవారి ఫ్లెక్సీలను తొలగించేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తుండడంతో రెండు పార్టీల మధ్య స్పర్ధలు నెలకొన్నాయి. దీంతో టీడీపీ పెద్దలు జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఫెక్సీలు తొలగించేందుకు ఆదేశాలు జారీ చేయించారు. కలెక్టర్‌ ఆదేశాలతో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది స్థానిక ఎత్తుబ్రిడ్జిపై ఉన్న వైఎస్సార్‌ సీపీ నాయకుల ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రతిఘటించడంతో అధికారుల తీరును వ్యతిరేకించారు. గత నెలలో జిల్లాకు వచ్చిన మంత్రి నారా లోకేష్‌ ఫెక్సీలను తొలగించకుండా తమవి తొలగించడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైకోర్టు ఆదేశాలూ బేఖాతరే..
వాస్తవానికి ప్రధాన మార్గాల్లో ఫ్లెక్సీల ఏర్పాటును హైకోర్టు చాన్నాళ్ల క్రితమే నిషేధించింది. ఇలాంటి ఫెక్సీలు ఏర్పాటు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తర్వాత కాలంలో మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రత్యేక తీర్మాణం చేసింది. అయితే ఆ ఆదేశౠలను అధికార పార్టీ నాయకులే తర్వాత కాలంలో బేఖాతరు చేశారు. పాలకవర్గమే నిబంధనలకు నీళ్లోదిలేసింది. ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఆ సంస్కృతి కొనసాగించడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో ముందు వెళితే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అన్న చందంగా తయారైంది అధికారుల పరిస్థితి. ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు.

పార్టీల అభ్యర్థన మేరకే..
హైకోర్టు ఆదేశాలు నిజమే. కానీ పార్టీల అభ్యర్థన మేరకు రెండు, మూడు రోజులు అనుమతిచ్చాం. కానీ రోజుల తరబడి వారు తొలగించడం లేదు. దీంతో మేము ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అమ్మవారి జాతర అనంతరం ఫ్లెక్సీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటాం. – హరిదాసు, మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి.

మరిన్ని వార్తలు