వెంటనే బలపరీక్ష జరగాలి!

25 Nov, 2019 12:59 IST|Sakshi

వాడీవేడిగా వాదనలు వినిపించిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌

సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు పట్టుబట్టాయి. బీజేపీ ఉద్దేశపూరితంగానే బలపరీక్షను జాప్యం చేయాలని చూస్తోందని, ఈ రోజు లేదా రేపటిలోగా బలపరీక్షకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరాయి. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా శివసేన పార్టీ తరఫున కపిల్‌ సిబల్‌, ఎన్సీపీ, కాంగ్రెస్‌ తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

మహారాష్ట్రలో హడావిడిగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించడం ద్వారా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారని సింఘ్వీ దుయ్యబట్టారు. అజిత్‌ పవార్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు ధ్రువీకరిస్తూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వారు లేఖ ఎంతమాత్రం ఇవ్వలేదని సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అజిత్‌ వద్ద ఉన్న లేఖతో బీజేపీ అతి తెలివి ప్రదర్శించిందని, గవర్నర్‌ ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమికి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారు సంతకాలు చేసిన అఫిడవిట్లను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, విచారణ పరిధిని పెంచడం ఇష్టంలేని సుప్రీంకోర్టు ఈ అఫిడవిట్లను స్వీకరించడానికి నిరాకరించింది. ఉద్ధవ్‌ ఠాక్రేకు 48మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, 56మంది శివసేన ఎమ్మెల్యేలు, 44మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతునిస్తున్నారని సింఘ్వీ స్పష్టం చేశారు.
చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేల ఫిరాయింపులు, బేరసారాలను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష జరగాలని, 24 గంటల్లో అసెంబ్లీ బలనిరూపణ చేసుకునేందుకు ఫడ్నవిస్‌ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సింఘీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇవ్వవద్దని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం శివసేన కూటమికి ఉందని తెలిపారు. బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ కూడా పేర్కొంటున్నదని, ఇరుపక్షాలు సిద్ధం‍గా ఉన్నప్పుడు ఇంకా జాప్యమెందుకని, వీలైనంత త్వరగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బలపరీక్ష జరగడం ముఖ్యమని, గెలుపోటములు కాదని అన్నారు.
చదవండి: ఒక పవార్‌ బీజేపీతో.. మరొక పవార్‌ ఎన్సీపీతో!

శివసేన తరఫున కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ.. 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందన్న అజిత్‌ పవార్‌ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తున్నట్టు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఏదని ప్రశ్నించారు. తమ వద్ద 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి అఫడవిట్లు ఉన్నాయని, ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని స్పష్టం చేశారు. కేవలం శాసనసభాపక్ష నేత అజితే ఫిరాయించారని ఆరోపించారు.

సభలో బలముంటే నిరూపించుకోవడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందని సిబల్‌ నిలదీశారు. తెల్లవారుజామునే హడావిడిగా రాష్ట్రపతి పాలన ఎందుకు ఎత్తివేశారని, చడీచప్పుడు లేకుండా హడావిడిగా ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉందని విమర్శించారు. సభలో వీడియో రికార్డింగ్‌ ద్వారా బలపరీక్ష జరగాలని కోరారు. ఉత్తరాఖండ్‌, కర్ణాటకలో జరిగిన తీరుగానే మహారాష్ట్రలోనూ బలపరీక్ష జరగాలని కోర్టును కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు