ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో నమిత వాగ్వాదం

29 Mar, 2019 13:23 IST|Sakshi

పెరంబూరు: ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో నటి నమిత వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది. వివరాల్లోకి వెళితే పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఓట్లకు నోట్లు విరజిమ్మడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు అలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ను దింపారు. వారు 24 గంటలు అనుమానం కలిగిన వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. రూ. 50 వేల కంటే ఎక్కువ డబ్బు, నగలను కలిగిన వారి నుంచి తగిన ఆధారాలు లేకుంటే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు.

ఇప్పటికే అలా కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. కాగా సేలం జిల్లాలో 33 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను, మరో 33 ప్రత్యేక పోలీస్‌ బృందాలను ఎన్నికల బృందం తనిఖీలకు నియమించింది. వారు ఆ జిల్లా వ్యాప్తంగా జల్లెడ పట్టి తనిఖీలు చేపట్టారు. వారు ఇప్పటి వరకూ రూ.50 కోట్ల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం సేలం, కొండాలాంపట్టి సమీపంలో  ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి ఆనంద్‌ విజయ్‌ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు.

ఆ సమయంలో అటుగా వచ్చిన నటి నమిత కారును నిలిపి తనిఖీ చేయాలని చెప్పగా నమితతో పాటు ఆమె కారులో ఉన్న మరి కొందరు అందుకు అడ్డు చెప్పారు. దీంతో అక్కడ నమితకు ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నామని, అందుకు సహకరించాలని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి చెప్పడంతో నటి నమిత వర్గం అంగీకరించారు. అయితే తనిఖీల్లో నమిత కారులో నగదు, ఇతర విలువైనవి లభించలేదు. దీంతో ఫ్లయింగ్‌స్క్వాడ్‌ ఆమె కారుని పంపేశారు.

మరిన్ని వార్తలు