మీడియా అభూత కల్పన.. అభివృద్ధే మా లక్ష్యం..

23 Jun, 2018 19:30 IST|Sakshi
ర్యాలీలో అమిత్‌ షా

శ్రీనగర్‌ ‌: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికారం కోసం పాకులాడదని, కేవలం అభివృద్ధిని మాత్రమే కోరుకుంటుందని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో శనివారం ఆయన కశ్మీర్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వంలో హిందూవులు అత్యధికంగా ఉన్న జమ్మూ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

కశ్మీర్‌ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 80 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు. అయితే, ఆ డబ్బు జమ్మూ, లద్ధాఖ్‌లకు చేరలేదని తెలిపారు. దీంతో ఈ రెండు ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడిపోయాయని అన్నారు. అభివృద్ధిలో సమన్యాయం లేకపోవడం వల్లే పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ)కి మద్దతు ఉపసంహరించామని చెప్పారు.

జమ్మూకశ్మీర్‌లలో ఎయిమ్స్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్రవేసిందని వెల్లడించారు. కానీ, ఇందుకు జమ్మూ ప్రాంతంలో పీడీపీ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ హయాంలోనే ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆపరేషన్స్‌ చేసేందుకు రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించారని మీడియా అభూత కల్పనలు వండి వారుస్తోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు