ఫారిన్‌ టూరిస్ట్‌లకు కేంద్ర మంత్రి వార్నింగ్‌

16 Mar, 2018 08:41 IST|Sakshi
కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకులపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కేజే ఆల్ఫోన్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫారిన్‌ టూరిస్ట్‌లు తమ దేశంలో తిరిగినట్లు.. భారత్‌లో తిరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన సున్నితంగా హెచ్చరించారు. 

తాజాగా ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...  ‘విదేశాల్లో రోడ్ల మీద విదేశీయులు బికినీలేస్కుని తిరుగుతారు. కానీ, ఇండియా విషయానికొస్తే ఇక్కడ అలా తిరగటం కుదరదు. ఉదాహరణకు లాటిన్‌ అమెరికాలో రోడ్లపైనే మహిళలు బికినీలతో దర్శనమిస్తుంటారు. అఫ్‌ కోర్స్‌.. మన దగ్గర గోవా బీచ్‌లో అలాంటి స్వేచ్ఛ ఉంది. కానీ, వీధుల్లో మాత్రం అలా తిరిగేందుకు ఒప్పుకోం. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. విదేశీయులతోపాటు మనవాళ్లు కూడా దానికి భంగం కలిగించకూడదు’ అని ఆల్ఫోన్స్‌ వ్యాఖ్యానించారు. 

అలాగని చీరలు కట్టుకునే ఇక్కడికి రావాలని విదేశీయులకు తాను చెప్పటం లేదని.. ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్లుగా మెదిలితే చాలని, మన ప్రజలు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు.. వాళ్లు కూడా కోరుకునేది ఇదేనని ఆయన తెలిపారు. కాగా, గతంలోనూ విదేశీ పర్యాటకులను ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘బీఫ్‌ను తమ దేశంలోనే తిని.. ఇండియాకు రావాలంటూ’ విదేశీ పర్యాటకులకు ఆయన సలహా ఇచ్చారు.

మరిన్ని వార్తలు