రయ్‌.. రయ్‌..రీజినల్‌!

22 Dec, 2018 02:34 IST|Sakshi

రీజినల్‌ రింగ్‌ రోడ్‌కు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం 

ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ జరుపుకోవాలని సూచన 

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12 వేల కోట్లు 

భూసేకరణకు రూ.3 వేల కోట్లు,ప్రాజెక్టు నిర్మాణానికి రూ.9 వేల కోట్లు 

భూసేకరణలో సగం ఖర్చు భరించనున్న రాష్ట్ర ప్రభుత్వం 

హైదరాబాద్‌కు 50 కి.మీ.,ఓఆర్‌ఆర్‌కు 30 కి.మీ. దూరంలో ఆర్‌ఆర్‌ఆర్‌ 

ఇక భవిష్యత్‌లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అవసరాలకే ఓఆర్‌ఆర్‌ పరిమితం... వాణిజ్య రవాణాలన్నీ ఆర్‌ఆర్‌ఆర్‌ మీదుగానే.. ఫలించిన టీఆర్‌ఎస్‌ ఎంపీల ప్రయత్నాలు 

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లోఒకటైన రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో ఎక్స్‌ప్రెస్‌ వే తరహాలో 362 కి.మీ. మేర ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకరించింది. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. టీఆర్‌ఎస్‌ ఎంపీల కృషితో ఆర్‌ఆర్‌ఆర్‌ కల సాకారం కానుంది. ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి మొత్తం రూ. 12 వేల కోట్ల వ్యయం కానుంది. ఇందులో భూసేకరణకు రూ. 3 వేల కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 9 వేల కోట్ల వ్యయం చేయనున్నారు. పారిశ్రామికంగా, ఐటీ పరంగా హైదరాబాద్‌ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని కోసం భూసేకరణకయ్యే ఖర్చులో సగం ఖర్చు భరించేందుకు తాము సిద్ధమే అని గతంలో కేంద్ర మంతి గడ్కరీతో సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఆ మేరకు భూసేకరణకు అయ్యే రూ. 3 వేల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం సగం ఖర్చు భరించనుంది. భూసేకరణలో మిగిలిన మొత్తాన్ని, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే రూ. 9 వేల కోట్ల వ్యయాన్ని కేంద్రం భరించనుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అనుమతులు పొందేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ ఇతర సమాచారాన్ని ఇటీవల కేంద్రానికి పంపారు. ప్రాజెక్టుకు అనుమతులు పొందే విషయమై గడ్కరీని కలవాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ ఆదేశించారు. 
ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో భేటీ...
కేసీఆర్‌ ఆదేశాలతో ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుమతులు సాధించే విషయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఈ నెల 18న ఎంపీలు గడ్కరీతో సమావేశమవ్వగా ఆయన 21న ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. దీంతో శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, కె. కవిత, జి.నగేశ్, బీబీ పాటిల్, లింగయ్య యాదవ్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డి... కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ డీజీ బీఎన్‌ సింగ్, ఎన్‌హెచ్‌ఏ సభ్యుడు ఆర్కే పాండేతో ప్రత్యేకంగా సమావేశమై ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించిన డీపీఆర్‌పై చర్చించారు. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ రెండు జాతీయ రహదారుల కలయిక కావడంతో ఉత్తర భాగంలో ఉన్న దాన్ని ఎన్‌హెచ్‌ నుంచి ఎన్‌హెచ్‌ఏఐకి ఇవ్వడం జరిగిందని, అలాగే దక్షిణ భాగంలో దాన్ని ఎన్‌హెచ్‌ నుంచి డీనోటిఫై చేసి ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోకి బదిలీచేసి నంబర్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎంపీలు వివరించారు. దీనికి సంబంధించి 10 రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కేంద్ర ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు సూత్రప్రాయంగా అంగీకరించినట్లేనని వారు స్పష్టం చేశారు. డీపీఆర్, భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం భరించే ఖర్చు వివరాలను పరిశీలించిన కేంద్ర రోడ్డు, రవాణా శాఖ, ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు ఆర్‌ఆర్‌ఆర్‌ను ప్రాథమికంగా అంగీకరించి భూసేకరణ ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇక భవిష్యత్తులో ఓఆర్‌ఆర్‌ కేవలం హైదరాబాద్‌ ట్రాఫిక్‌ రద్దీకి సరిపోతుందని, ఇతర వాణిజ్య రవాణా అంతా ఆర్‌ఆర్‌ఆర్‌ మీదుగానే సాగుతుందని ఎంపీ జితేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ మానసపుత్రిక రీజినల్‌ రింగ్‌ రోడ్డు త్వరలోనే సాకారం కానుందని ఎంపీ కవిత పేర్కొన్నారు.  

25 స్పైనల్‌ రోడ్లు.. 
ఈ రహదారితో ఎన్‌హెచ్‌ –9, ఎన్‌హెచ్‌ –7, ఎన్‌హెచ్‌ –202.. అనుసంధానం మరింత సులువుగా మారనుంది. ఇబ్రహీంపట్నం, తూఫ్రాన్, శివంపేట, నర్సాపూర్, సంగారెడ్డి, ఎద్దుమైలారం, శంకర్‌పల్లి, చేవెళ్ల, పామెన, తాడ్లపల్లె, షాబాద్, షాద్‌నగర్, కేశంపేట, మల్కాపూర్, భువనగిరి, చౌటుప్పల్, మాల్‌ – యాచారం, వర్గల్‌ తదితర ప్రాంతాలను ఈ రోడ్డు కలుపుతుంది. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డును కలుపుతూ దాదాపు 25 స్పైనల్‌ రోడ్లు వేయనున్నారు. దీంతో రాష్ట్ర రవాణా రంగం కొత్తపుంతలు తొక్కనుంది. 

11,000 ఎకరాలు కావాలి..
తెలంగాణ వచ్చాక కేంద్రం మంజూరు చేసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు ఇది. హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్, రోజురోజుకు ఎక్కువవుతున్న వాహనాల నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు తరహాలో ఈ రోడ్డు అనివార్యంగా మారింది. 338 కిలోమీటర్ల సుదూర, విశాల రింగ్‌రోడ్డు ఇది. దీన్ని ఆరు వరుసల్లో రెండు ఫేజ్‌ల్లో పూర్తి చేస్తారు. ఇంతటి భారీ ప్రాజెక్టుకు భూమి పెద్ద ఎత్తున కావాలి. మొత్తం 4,500 హెక్టార్లు అంటే దాదాపుగా 11,000 ఎకరాల భూమిని సేకరించనున్నారు. త్వరలోనే పనులు చేపడతామని ఆర్‌అండ్‌బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతి రెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు