వ్యతిరేకతను కేంద్రం ముందే ఊహించింది : హరిబాబు

20 Dec, 2019 19:43 IST|Sakshi

సాక్షి, విశాఖపట్టణం : పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్య రాష్ట్రాల్లో వస్తున్న వ్యతిరేకతను కేంద్రం ముందే ఊహించిందని మాజీ బీజేపీ ఎంపీ హరిబాబు శుక్రవారం వెల్లడించారు. ఇది చాలా చిన్న సవరణ. మైనార్టీల గురించి నెహ్రూ - లియాకత్‌ అలీలు చేసుకున్న ఒప్పందం పొరుగు దేశాల్లో సరిగ్గా అమలు చేయలేదు. అందుకని భారతదేశానికి వలస వచ్చి ఐదేళ్లు నివాసం పూర్తి చేసుకున్న వాళ్లకు పౌరసత్వం ఇచ్చే చట్టం ఇది. దీని వల్ల ఏ పౌరుడి పౌరసత్వం తొలగిపోదని వివరణనిచ్చారు. కావాలనే కొందరు మైనార్టీలను రెచ్చగొడుతున్నారని, ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌, ఆప్‌ వంటి పార్టీలు చట్టసవరణను వ్యతిరేకిస్తున్నాయని, నాడు లెఫ్ట్‌ నేతలే చట్టసవరణ కావాలని పట్టుబట్టాయని పేర్కొన్నారు. ఇప్పటి లెఫ్ట్‌ నేతల మాటలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మైనార్టీలను రెచ్చగొడుతున్నారు తప్ప వారి వాదనలో బలం లేదని తెలిపారు. ఇక ఆర్టికల్‌ 14కు తూట్లు పొడుస్తున్నారంటూ మీడియాలో కథనాలు రాస్తున్న మాజీ మంత్రి చిదంబరాన్ని తప్పుపట్టారు. ఆయన చెప్తున్నట్టు ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.    

>
మరిన్ని వార్తలు