మోదీపై బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పోటీ

30 Mar, 2019 13:28 IST|Sakshi

వారణాసి బరిలో మాజీ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మోదీపై ఓ మాజీ బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ పోటీకి దిగారు. పాకిస్తాన్‌-భారత్‌ సరిహద్దుల్లో పహరా కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లకు నాణ్యత లేని ఆహారం సరఫర చేస్తున్నారంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంచలనం రేపిన బీఎస్‌ఎఫ్‌ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా రాజకీయ పార్టీలు తనను వారణాసి నుంచి పోటీ చేయాలని కోరాయని, కాని తాను స్వతంత్ర అభ్యర్థిగానే ఎన్నికల్లో ప్రధానిపై పోటీ చేస్తానని తేజ్ బహదూర్ తెలిపారు. 

కొందరు సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులు అక్రమాలకు పాల్పడుతూ జవాన్లకు నాణ్యత లేని ఆహారం పెడుతున్నారని 2017 లో సోషల్‌ మీడియాలో వీడియోను పోస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ వీడియోను పోస్ట్‌ చేసి వాస్తవాన్ని వెల్లడించినందుకు మానసికంగా ఎంతో వేధించారని చెప్పారు. ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం ముఖ్యం కాదని, కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగానే తాను మోదీపై పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

>
మరిన్ని వార్తలు