అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరిన నాదెండ్ల

6 Jul, 2019 18:05 IST|Sakshi

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అమిత్‌షా

బీజేపీలో చేరిన నాదెండ్ల భాస్కరరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చంద్రవదన్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది. దానిలో భాగంగా శనివారం (జూలై 6)  దేశవ్యాప్తంగా చేపట్టే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌ వచ్చారు. శంషాబాద్‌లో ఆయన పార్టీ సభ్యత్వ నమోదును కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరిజన మహిళ సోని బీజేపీ సభ్యురాలిగా అమిత్‌షా సమక్షంలో తొలి సభ్యత్వం తీసుకున్నారు. ఇదిలాఉండగా... చాన్నాళ్ల నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. అమిత్‌ షా ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భాస్కరరావుతో పాటు రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

చులకనగా చూడొద్దు...
బహిరంగ సభలో అమిత్‌షా మాట్లాడుతూ.. ‘బీజేపీని ఆదరించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు. తెలంగాణలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం ఖాయం. ఈ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేస్తాం. పార్టీలో ఎన్నో గెలుపోటములు చూశాం. మమ్మల్ని చులకనగా చూసిన కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాకూడా దక్కలేదు. తెలంగాణలో 20 లక్షల సభ్యత్వమే మా లక్ష్యం. పేదలు మహిళలకోసం బడ్జెట్‌లో ఎన్నొ పథకాలు ప్రకటించాం. 2022 కల్లా 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నెలకొల్పుతాం’అన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితరులు హాజరయ్యారు. రాత్రి 7 గంటలకు తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయిన అనంతరం అమిత్‌షా ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

మరిన్ని వార్తలు