మాజీ డిప్యూటీ సీఎం పీఏ ఆత్మహత్య

12 Oct, 2019 16:18 IST|Sakshi

బెంగుళూరు: కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర పీఏ రమేష్‌ శనివారం బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడినట్లు డిప్యూటీ కమిషనర్ (వెస్ట్) బి.రమేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జ్ఞాన భారతి ప్రాంతంలో రమేష్ మృతదేహం లభించిందని, అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు. రమేష్‌ కారులో ఒక లెటర్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారని, ఫోరెన్సిక్‌ నివేదిక కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అయితే మెడికల్‌ కళాశాల సీట్ల విషయంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో ఐటీ శాఖ పరమేశ్వర, ఆయన బంధువుల ఇంట్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.(చదవండి : మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో రూ. 4.25 కోట్లు)

ఈ క్రమంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పరమేశ్వర వెంట రమేష్‌ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పరమేశ్వర స్పందిస్తూ రమేష్‌ చాలా మంచి వ్యక్తి అని, ఐటీ శాఖ సోదాల గురించి చింతించాల్సిన అవసరం లేదని ఉదయం రమేశ్‌తో చెప్పానని అన్నారు. కానీ, అంతలోనే ఏ ఒత్తిడి మేరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఐటీ అధికారులు వేధిస్తున్నట్లు రమేష్‌ తన  సన్నిహితులతో చెప్పాడని ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు