ప్రభాకరా.. అభివృద్ధిపై ఆత్మవిమర్శ చేసుకో

29 Jul, 2019 07:36 IST|Sakshi
మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నేత కోగటం విజయభాస్కర్‌ రెడ్డి   

సాక్షి, అనంతపురం న్యూసిటీ: ‘గత ప్రభుత్వ నిర్వాకంతో నగరంలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. రూ.191 కోట్ల పైప్‌లైన్‌ పనులు సకాలంలో చేయించకపోవడంతో ప్రపంచ బ్యాంకు నిధులు వెనక్కు వెళ్లాయి. ఏపీఎండీపీ పైప్‌లైన్, అమృత్‌ స్కీం పనులు సాగక నగరం గుంతలమయం అవడానికి, ప్రజల కన్నీటి కష్టాలకు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి నిర్లక్ష్యమే కారణం. ఇప్పటికైనా ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కోగటం విజయభాస్కర్‌ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. నగరాభివృద్ధికి ఎమ్మెల్యే ‘అనంత’ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రూ.15 కోట్లతో పైప్‌లైన్‌ పనులు జరిగేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. రూ.4 కోట్లతో పైప్‌లైన్‌ కోసం తీసిన గుంతలను పూడ్చేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

సర్వజనాస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రూ.250 కోట్లతో 700 పడకల సామర్థ్యంతో అదనపు భవనం ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని, ఈ విషయంలో ఎమ్మెల్యే అనంత కీలకంగా వ్యవహరించా రన్నారు. స్టాఫ్‌నర్సుల డిప్యుటేషన్‌పై సకా లంలో స్పందించి,  తిరిగి వారు సర్వజనాస్పత్రికి వచ్చేలా చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని ప్రభాకర్‌చౌదరి.. ఇప్పుడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డికి లేఖ రాస్తామని చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మండిపడ్డారు. ఆపరేషన్‌ కోసం ఇతర ప్రాంతానికి వెళితే దాన్ని బూతద్దంలో చూడడం సరికాదన్నారు. త్వరలోనే ఆయన నగరానికి రానున్నారని, గత ప్రభుత్వం కంటే భిన్నంగా అభివృద్ధి చేసి చూపుతారన్నారు.

మరిన్ని వార్తలు