‘అందుకే టీడీపీ వీడి.. వైఎస్సార్‌ సీపీలో చేరా’

17 Mar, 2020 14:41 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: ఎలక్షన్‌ కమిషన్‌ ఒత్తిడికి గురై ఉద్దేశపూర్వకంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు అనుకున్న కాలానికి జరిగితే రాష్ట్రానికి రావలసిన రూ. 5 వేల కోట్ల నిధులు వస్తాయని తెలిపారు.  రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదని చెప్పారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిడుతున్న టీడీపీ నాయకులు.. నాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిస్తే ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు. అందుకే విలువలులేని తెలుగుదేశం పార్టీని వీడి.. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరానని వెల్లడించారు.(‘ఎన్నికలు జరగకపోతే ఆ నిధులు ఆగిపోతాయి’)

‘ఆయన్ని దుష్టశక్తులు ఆవహించాయి’

అదే విధంగా సీఎం జగన్‌ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాగే టీడీపీ మీద నమ్మకం లేకనే మంచి నాయకులంతా పోటీ చేయలేదన్నారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పారు. రాష్ట్రం కోసం సీఎం జగన్‌ చేసే ఆలోచనలు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్‌ మీద బురద చల్లాలని చూస్తే దేవుడే వారికి బుద్ధి చెబుతాడని పేర్కొన్నారు. గతంతో చంద్రబాబు కుమారుడు లోకేష్‌.. గతంలో కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించడానికి అందరినీ డబ్బుతో కొనమని చెప్పాడని, వైఎస్సార్‌ సీపీకి అత్యధిక మెజారిటీ ఉన్నా డబ్బులతో ఆయనను ఓడించారని రామసుబ్బారెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు