తుంకూరు నుంచి మాజీ ప్రధాని పోటీ

23 Mar, 2019 19:32 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కర్ణాటకలోని తుంకూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్-కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు జేడీఎస్ అధికార ప్రతినిధి రమేష్ బాబు శనివారం ప్రకటించారు. తుంకూరు నియోజకవర్గం నుంచి దేవెగౌడ పోటీ చేస్తున్నారని ప్రకటించగానే, అక్కడి సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ముద్దహనుమెగౌడ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'ఏమిటీ సంకీర్ణం, సమన్వయం ఎక్కడుంది? ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీని నేను. నాకెందుకు టిక్కెట్ నిరాకరించారు. ఇది సరైనది కాదు' అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో హనుమెగౌడ బీజేపీ అభ్యర్థి జీఎస్.బసవరాజయ్యపై 74 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, తన హసన్‌ లోక్‌సభ స్థానాన్ని మనవడు ప్రజ్వల్‌కు ఇస్తున్నట్లు దేవెగౌడ ఇటీవల స్వయంగా ప్రకటించారు. జేడీఎస్‌కు గట్టిపట్టున్న మాండ్యాం నుంచి పోటీచేయాలని ఆయన యోచించినా అక్కడ  సీఎం కుమార స్వామి కుమారుడు నిఖిల్‌ బరిలో నిలవడంతో పోటీ నుంచి తప్పుకోక తప్పలేదు. కీలకమైన ఎన్నికలు కావడంతో అటు కాంగ్రెస్‌ నుంచి, ఇటు సొంతపార్టీ నుంచి ఆయన పోటీకి తీవ్రంగా పట్టుబట్టారు. దీంతో దేవెగౌడ పోటీకి దిగక తప్పలేదు. మొత్తం 28 సీట్లలో కాంగ్రెస్‌ 19, జేడీఎస్‌ 9 చోట్ల పోటీచేయబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దేవెగౌడ 1991నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మరిన్ని వార్తలు