‘చంద్రబాబు ఆ మాట ఉత్తరాంధ్ర ప్రజలతో చెప్పిస్తారా?’

28 Jan, 2020 11:54 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అమరావతికి మద్దతుగా రాష్ట్రమంతటా తిరుగుతానన్న ప్రతిపక్షనేత చంద్రబాబు ఇప్పుడు ఎందుకు తిరగడం లేదని వుడా మాజీ ఛైర్మన్‌ ఎస్‌ఏ రెహమాన్‌ ప్రశ్నించారు. అంధ్రప్రదేశ్‌ను సన్‌రైజ్‌ స్టేట్‌ అన్నారని సన్‌ అంటే అన కొడుకు అన్నది ఆయన ఆలోచనని ఎద్దేవా చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో చంద్రబాబు అవలంభిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘చంద్రబాబుకు అన్నీ తెలుసు. కానీ దేన్నీ సవ్యంగా తీసుకెళ్లరు. ఆయన మనసులో ఉండేది ఒకటి. పైకి చెప్పేది మరొకటి. విశాఖలో రాజధాని కావాలని ఎవరడిగారని బాబు ప్రశ్నిస్తున్నారు. మరి అమరావతిని రాజధాని చేయాలని మిమ్మల్ని ఎవరడిగారు? విశాఖ రాజధాని కావాలని 1953లోనే చట్టసభ తీర్మానం చేసింది. అది ఎవరికీ తెలయదులే అని బాబు అనుకున్నారు. చంద్రబాబు ఉత్తరాంధ్రకు వచ్చి రాజధాని వద్దని ప్రజలతో అనిపించే దమ్ముందా? యూటర్న్‌ చంద్రబాబు ప్రధాని మోదీ మీద విషపోరాటం చేసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాకుండా చేశారు.  

చంద్రబాబు 23 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను చేరదీసి పదవులిచ్చిన మాట వాస్తవం. కానీ ఆయనే టీడీపీ ఎమ్మెల్సీలను సీఎం వైఎస్‌ జగన్‌ కొనబోయారని ఆరోపించడం హాస్యాస్పదం. మీరు ఐదేళ్లు ఓపిక పట్టండి ప్రజలే తీర్పు ఇస్తారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే, టీడీపీ సిటీ అధ్యక్షుడు వాసుపల్లి నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అమరావతని రేసు కారుతో, విశాఖను ఎడ్లబండితో పోల్చారు. అలా పోల్చడం దారుణం.  గాడిదలు లొట్టిపిట్టలతో పిచ్చి ఉద్యమాలు చేయడం మానాలి. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ అమరావతే రాజధాని అనే నినాదంతో పోటీ చేయాలి. ఇదే రిఫరెండంగా తీసుకుందాం’అని రెహమాన్‌ సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు