టీడీపీ నేత శివప్రసాద్‌ కన్నుమూత

21 Sep, 2019 14:28 IST|Sakshi

సాక్షి, చెన్నై : టీడీపీ సీనియర్‌ నేత, చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం మరణించారు. ఈ నెల 12 న శివప్రసాద్‌ను ఆయన కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా, అప్పటి నుంచి డయాలసిస్‌ చేస్తున్నారు. శివప్రసాద్‌ మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. చంద్రబాబు నిన్న సాయంత్రం శివప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. 1951జూలై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో ఆయన జన్మించారు. తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. 

మరోవైపు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా శివప్రసాద్‌ మృతి పట్ల సంతాపం తెలిపారు. వైద్యుడిగా సేవలు అందిస్తూ చిత్రరంగంలోకి ప్రవేశించారు. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక 2006లో ‘డేంజర్‌’ చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు.  

అనంతరం రాజకీయాలపై ఆసక్తితో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా, రెండుసార్లు చిత్తూరు ఎంపీగా పని చేశారు. శివప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు. అలాగే రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆయన రోజుకో వేషం వేస్తూ వినూత్నంగా నిరసనలు చేశారు. పార్లమెంట్‌ ఆవరణలో విచిత్ర వేషధారణతో శివప్రసాద్‌ తన నిరసన తెలిపేవారు.

సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
శివప్రసాద్‌ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం జగన్‌ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు