మోదీ ఫెయిల్‌.. రాహుల్‌ మాత్రం...

19 Jun, 2018 10:12 IST|Sakshi

‘కశ్మీర్‌ సమస్యను పరిష్కరించటంలో ప్రధాని నరేంద్ర మోదీ ఘోరంగా విఫలం అయ్యారు. కానీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే మాత్రం ఖచ్ఛితంగా ఓ పరిష్కారం చూపగలుగుతారు’... బీజేపీ దిగ్గజం ఎల్‌కే అద్వానీ మాజీ సహాయకుడు, బీజేపీ మాజీ అధికార ప్రతినిధి సుధీంద్ర కులకర్ణి చెబుతున్న మాటలివి. 

సాక్షి, ముంబై: మోదీ వల్ల పరిష్కారం కానీ కశ్మీర్‌ సమస్యను రాహుల్‌ గాంధీ ఖచ్ఛితంగా పరిష్కరించగలరని సుధీంద్ర ఘంటాపథంగా చెబుతున్నారు. సోమవారం ముంబైలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ రాసిన ‘స్పెక్ట్రమ్‌ పాలిటిక్స్‌’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ  ఈవెంట్‌కు హాజరైన సుధీంద్ర.. రాహుల్‌పై ప్రశంసలు గుప్పించారు. ‘పొరుగున ఉన్న పాకిస్థాన్‌, చైనాలతో సమస్యలను పరిష్కరించుకోగలిగినప్పుడే భారత్‌ బలమైన శక్తిగా ఎదుగుతుంది. కానీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ విషయంలో అన్ని రకాలుగా విఫలమైంది. కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడటం లేదు. అయితే రాహుల్‌ ప్రధాని అయితే మాత్రం ఆ సమస్యలన్నీ పరిష్కరం కావొచ్చు’ అన్న అభిప్రాయాన్ని సుధీంద్ర వ్యక్తం చేశారు.

‘రాహుల్‌ గాంధీ మంచి మనసు ఉన్న నేత. అది నేతల్లో చాలా అరుదుగా కనిపించే గుణం. ప్రజలను ఇట్టే ఆకర్షిస్తుంది. అయితే ఆయనకు ఓ సలహా. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలోనే రాహుల్‌ అఫ్గనిస్తాన్‌లో పర్యటించారు. అదే విధంగా పాక్‌, చైనా, బంగ్లాదేశ్‌లో కూడా పర్యటించి అక్కడి నేతలతో ‘కీలక సమస్యల’పై చర్చిస్తే మంచిది’ అని సుధీంద్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడికి సూచించారు. భవిష్యత్తులో రాహుల్‌ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు సుధీంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు