నాలుగు జెండాలాట

24 May, 2019 09:54 IST|Sakshi
ధ్రువీకరణ పత్రంతో అసద్‌ కిషన్‌రెడ్డి విజయహాసం... అభిమానులతో రేవంత్‌ కరచాలనం రంజిత్‌రెడ్డి విజయోత్సాహం

గ్రేటర్‌లో నాలుగు పార్టీల గెలుపు

హైదరాబాద్‌లో మళ్లీ అసదుద్దీన్‌ హవా

సికింద్రాబాద్‌ను నిలుపుకొన్న బీజేపీ

మల్కాజిగిరిలో గెలిచిన రేవంత్‌రెడ్డి

చేవెళ్లలో టీఆర్‌ఎస్‌దే గెలుపు

సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఈసారి ‘నాలుగు స్తంభాలాట’ కనిపించింది. గ్రేటర్‌పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ వేర్వేరు పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపొందారు. హైదరాబాద్‌లో ఎంఐఎం, సికింద్రాబాద్‌లో బీజేపీ, మల్కాజిగిరిలో కాంగ్రెస్, చేవెళ్లలోటీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల  ఓట్ల లెక్కింపు ఆద్యంతం అనేక మలుపులు తిరుగుతూ అందరినీ ఉత్కంఠకు గురి చేసింది. ముఖ్యంగా మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల్లో మెజారిటీ ఒక్క రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని వరిస్తే, మరో రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి వచ్చింది.

మొత్తంగా చూస్తే హైదరాబాద్‌లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ, సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి, మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎ.రేవంత్‌రెడ్డి, చేవెళ్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ రంజిత్‌రెడ్డిలు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. గడిచిన శాసనసభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో నగర ఓటర్లు విభిన్న తీర్పునివ్వటం విశేషం. హైదరాబాద్‌ లోక్‌సభలో ఎంఐఎం సహజ ఓటు బ్యాంక్‌తోనే మళ్లీ విజయబావుటా ఎగరేయగా, శాసనసభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని బీజేపీ, కాంగ్రెస్‌లు సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో మళ్లీ గత వైభవాన్ని సాధించాయి. 2014లో చేవెళ్ల లోక్‌సభ స్థానాన్ని గెలిచిన టీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి  స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 

లోక్‌సభకు ముగ్గురు కొత్తే...  
నగరం నుండి లోక్‌సభకు ఎన్నికైన నలుగురిలో ముగ్గురు కొత్తవారే. హైదరాబాద్‌ నుండి విజయం సాధించిన అసదుద్దీన్‌ ఇప్పటికే పలుమార్లు ఎన్నికవగా, సికింద్రాబాద్‌ స్థానం నుండి విజయం సాధించిన కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి నుండి విజయం సాధించిన రేవంత్‌రెడ్డిలు లోక్‌సభకు కొత్తే. వీరిద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఎంపీగా పోటీ చేసిన తొలిసారే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక చేవెళ్లలో విజయం సాధించిన డాక్టర్‌ రంజిత్‌రెడ్డి రాజకీయాలకే పూర్తిగా కొత్త. మొత్తంగా చూస్తే మహానగర ప్రజలు నాలుగు లోక్‌సభ పరిధిలో నాలుగు పార్టీలు, నలుగురు విభిన్న వ్యక్తిత్వం కలిగిన వారిని లోక్‌సభకు పంపి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

మరిన్ని వార్తలు