విజయంలో ఆ నలుగురు

4 Mar, 2018 01:44 IST|Sakshi
హిమంత బిస్వా, సునీల్‌ దేవధర్

బీజేపీ గెలుపులో వీరిదే ప్రధాన భూమిక

న్యూఢిల్లీ: 2014కు ముందు ఈశాన్యరాష్ట్రాల్లో బీజేపీ జెండా పట్టుకునే వారే లేరు. 10–15 ఏళ్ల ముందునుంచి ఆరెస్సెస్‌ తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ రాజకీయంగా బీజేపీకి వార్డు మెంబర్లు కూడా లేని పరిస్థితి. కానీ ఈ మూడున్నరేళ్లలో పరిస్థితి చాలా మారింది. ఆరెస్సెస్‌ క్షేత్రస్థాయి పనికి బీజేపీ జాతీయ నాయకత్వం వ్యూహాలు తోడవటంతో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటుచేసే స్థాయికి ఎదిగింది. అస్సాంలో అధికారంతో మొదలైన బీజేపీ ‘ఈశాన్య’ పయనం త్రిపుర విజయంతో మరింత విశ్వాసంగా ముందుకెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. త్రిపురలో కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టడం, నాగాలాండ్‌లోనూ బీజేపీకి విజయాన్ని అందించటంలో నలుగురు నేతలు అన్నీ తామై వ్యవహరించారు. వారే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, అస్సాం మంత్రి, బీజేపీ ఈశాన్య రాష్ట్రాల బాధ్యుడు హిమంత బిస్వా, త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్‌ కుమార్‌ దేవ్, ఆరెస్సెస్‌ వ్యూహకర్త సునీల్‌ దేవధర్‌.

హిమంత బిస్వా శర్మ
2015లో బీజేపీలో చేరకముందు ఈయన కాంగ్రెస్‌ నేత. దశాబ్దానికి పైగా అస్సాం కాంగ్రెస్‌కు సేవలందించారు. అప్పటి సీఎం తరుణ్‌ గొగోయ్‌తో భేదాభిప్రాయా లతో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలో చేరారు. ఈయన సామర్థ్యాన్ని గుర్తించిన బీజేపీ.. పార్టీలోకి వస్తూనే 2015 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన వ్యూహకర్తగా అవకాశాన్నిచ్చింది. పలువురు బీజేపీ కేంద్ర నాయకులతో కలిసి బిస్వా రూపొందించిన వ్యూహాలు.. గొగోయ్‌ కోటను బద్దలు కొట్టి బీజేపీకి పట్టంగట్టాయి. ఈశాన్య రాష్ట్రాలపై మంచి అవగాహన ఉన్న హిమంతకు ఆ తర్వాత నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర పగ్గాలను పార్టీ అప్పగించింది. అవతలి పార్టీల నేతలను చేరుకుని కూటములు ఏర్పాటు చేయటం, బీజేపీలోకి ఆహ్వానించటంలో శర్మ రూటే సెపరేటు. వనరులను సృష్టించటంలోనూ ఈయన అందెవేసిన చేయి. త్రిపురలో ఐపీఎఫ్‌టీతో, నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో పొత్తుల విషయంలో హిమంత కీలకంగా వ్యవహరించారు.

సునీల్‌ దేవధర్‌
ఆరెస్సెస్‌ ముఖ్య నేత. పదేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాల్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లో సంఘ్‌ ప్రభావం పెంచటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే దేవధర్‌ను.. అమిత్‌ షా త్రిపుర ప్రధాన వ్యూహకర్తగా నియమించారు. అదీ ఎన్నికలకు మూడేళ్ల ముందుగానే. బీజేపీ ఇంటింటి ప్రచారం విజయవంతం కావటంలో ఈయన పాత్ర అత్యంత కీలకం.

విప్లవ్‌ కుమార్‌ దేవ్‌
బీజేపీ త్రిపుర ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందువరసలో ఉన్నారు. బీజేపీ త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు. మాజీ ఆరెస్సెస్‌ ప్రచారక్‌ కూడా. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనప్పటికీ.. బీజేపీ ఈయన్నే ముందుండి ప్రచారాన్ని నడిపించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుదీప్‌రాయ్‌ బర్మన్‌ సహా పలువురు ముఖ్యమైన కాంగ్రెస్‌ నేతలను బీజేపీలో చేర్చటంలో కీలకంగా వ్యవహరించారు.

రామ్‌మాధవ్‌
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. జమ్మూకశ్మీర్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీ కూటములు ఏర్పాటుచేయటంలో రామ్‌ మాధవ్‌ అసలైన వ్యూహకర్త. చాలా ఓపికగా వ్యవహరించటం. వ్యూహాలు రచించటంలో దిట్ట. ఎన్‌డీపీపీతో బీజేపీ పొత్తులోనూ హిమంతతో కలిసి పనిచేశారు.

>
మరిన్ని వార్తలు