నమో మంత్రమేనా!

6 May, 2019 05:49 IST|Sakshi

పైకి కనిపించకుండా అంతటా మోదీ హవా?

రాజకీయ పండితులకు కూడా అందని ఓటరు నాడి

ప్రతీ దశలోనూ భారీగా జరుగుతున్న పోలింగ్‌..

కానీ మొగ్గు ఎటు ? ఏ పార్టీది పైచేయి ? ఇప్పుడు ఇదే చర్చ

‘‘బయటకి కనిపించడం లేదు కానీ ఈ సారి ఒక రాజకీయ పార్టీకి కాదు జనం ఓటు వేస్తున్నది. ఒక వ్యక్తిని చూసి వేస్తున్నారు. ఆయన కరిష్మా అలాంటిది. ప్రతిపక్షంలో అలాంటి నాయకుడే కనిపించడం లేదు. అందుకే అచ్చంగా 2014 మాదిరిగా, ఈ సారి కూడా భారతీయులు నమో మంత్రాన్నే జపిస్తున్నారు’’  ఇదీ కొందరు ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయం

 ఏడు దశల ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు ముగిసి, ఈరోజు ఐదో దశ పోలింగ్‌ జరుగనుంది. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోరు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విసిరిన సవాళ్లకు ఒడిశాలో బీజేడీ, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, యూపీలో బీఎస్పీ, ఎస్పీ కూటమి, బిహార్‌లో ఆర్‌జేడీ కూటమి బెదిరినట్టుగా కనిపించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ తమ బ్రహ్మాస్త్రం అంటూ తీసుకువచ్చిన ప్రియాంక గాంధీ, అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి కొత్తదనాన్ని చూపించలేకపోయారు. రాహుల్‌ ఎంతో గొప్పగా చెప్పుకున్న కనీస ఆదాయ పథకం (న్యాయ్‌)ని జనంలోకి తీసుకువెళ్లడంలో కూడా విఫలమైనట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి.  

మోదీ ప్రచారం విభిన్నం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఎన్నికల ర్యాలీల నిర్వహణ దగ్గర్నుంచి మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూల వరకు తనని తాను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వారణాసిలో నామినేషన్, గంగాహారతి, ఆ తర్వాత పడవలో ప్రయాణిస్తూ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎంతో కొత్తగా కనిపించాయి. మోదీ బయోపిక్‌ విడుదలకు బ్రేక్‌ పడిన తర్వాత బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై ఓటర్లలో ఎనలేని ఆసక్తి కనిపించింది. గత ఎన్నికల్లో గుజరాత్‌ అభివృద్ధిని ఒక మోడల్‌గా చూపించిన మోదీ ఈసారి ఎన్నికల్ని గత అయిదేళ్లలో ప్రభుత్వం పనితీరుపై కాకుండా, తన వ్యక్తిగత ఇమేజ్‌ చుట్టూ తిప్పుకోవడమే కాదు, జాతీయ భద్రత అనే అంశాన్ని ఎక్కడికెక్కడ ప్రస్తావిస్తూ ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించారన్న అభిప్రాయమూ ఉంది.  

మోదీ కాకపోతే.. ఎవరు ?
ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానం లేదు. ప్రధానమంత్రితో ఢీ కొట్టే వ్యక్తి తానే భవిష్య ప్రధాని అని చెప్పుకోగలగాలి. కానీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తనకు పదవి ముఖ్యం కాదని, ప్రధాని రేసులో లేనని బహిరంగంగానే వెల్లడించారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఒక ఇంటర్వ్యూలో ‘‘మోదీ ప్రధాని కాక ముందు గుజరాత్‌ ముఖ్యమంత్రి. అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. నా అభిప్రాయంలో మమతాబెనర్జీ, చంద్రబాబు నాయుడు, మాయావతి వంటి నేతలే ప్రధాని పదవికి అర్హులు’’అని నిర్మొహమాటంగా చెప్పారు. ఆయన కూడా రాహుల్‌ పేరుని ప్రస్తావించలేదు సరికదా, తన పేరు కూడా తీసుకురాలేదు. ఇక ప్రధాని పదవికి తగినవారంటూ కితాబునిచ్చిన మమత, బాబు, మాయావతి పేర్లు ఓటర్లలో ఏ మాత్రం ఉత్సాహాన్ని తీసుకురాలేకపోయాయి ‘‘బీజేపీ సొంతంగా మేజిక్‌ ఫిగర్‌కు (272 సీట్లు) చేరుకోలేకపోతే కొత్త మిత్రులు వస్తారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు , శాశ్వత మిత్రులు ఉండరు‘‘అని మోదీ బృందంలో కీలక సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఇక విపక్షాల మధ్య ఐక్యత కూడా కనిపించడం లేదు. మహాగఠ్‌ బంధన్‌ అన్నారు కానీ, చాలా చోట్ల పొత్తులున్నా ఎవరికి వారు అభ్యర్థుల్ని దింపారు

పోటాపోటీ సమీకరణలు బీజేపీకి అనుకూలమా ?  
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వంటి కీలక రాష్ట్రాల్లో సామాజిక వర్గాల పోటాపోటీ సమీకరణలు బీజేపీకి కలిసివస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. యూపీలో యాదవులు సహా కొన్ని బీసీ కులాలు, మాయావతి వర్గమైన దళితుల్లోని జాటవులు, ముస్లింల ఓట్లు ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీతో కూడిన మహాకూటమికి ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల్లో పడినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అగ్రవర్ణాలతో పాటు మిగిలిన సామాజికవర్గాలైన యాదవేతర బీసీలు, జాటవేతర దళితులు బీజేపీకి అనుకూలంగా మారారు. మోదీ హయాంలో గోవధ నెపంతో మూకదాడులు వంటి చర్యలు ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచాయి. వారి ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్‌ పార్టీ చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ల ఓట్లు ఎక్కడికీ పోవు అన్న ధీమాతో ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేయలేదు. దీంతో పోలింగ్‌ బూతులకు వచ్చి ఓటు వేయాలన్న ఉత్సాహం ముస్లిం ఓటర్లకు కలగలేదు. ముంబై వంటి నగరాల్లో ముస్లింల ఓటింగ్‌ శాతం గణనీయంగా పడిపోయింది. ఇది బీజేపీకి అనుకూలంగా మారుతుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  
 
కొన్ని రాష్ట్రాల్లో సవాళ్లు  
మొత్తం లోక్‌సభ స్థానాలు : 543
నాలుగు దశల్లో పోలింగ్‌ జరిగిన స్థానాలు : 374
మిగిలిన మూడు దశల్లో పోలింగ్‌ జరిగే సీట్లు : 169

ఈ సీట్లు బీజేపీకి అత్యంత కీలకం. చాలా చోట్ల కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరు ఇక్కడే ఉంది.  ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అయిదేళ్ల క్రితం బీజేపీకి ఉన్న పట్టు ఇప్పుడు లేదు. అందుకే పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై మోదీ, షా ద్వయం గంపెడు ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో బెంగాల్‌లో రెండు, ఒడిశాలో ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి కనీసం చెరో 10 సీట్లు అయినా సాధించాలని ప్రణాళికలు రచించింది. ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ 20 ఏళ్లుగా సీఎంగా ఉండడంతో ఎంతో కొంత ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారినట్టు ఒక అంచనా. బీజేడీ నుంచి ఫిరాయింపుదారులకే ఈ సారి బీజేపీ టికెట్లు ఇచ్చి రంగంలోకి దింపింది.  

ఇక బిహార్‌లో మోదీ, నితీశ్‌ ద్వయానికి అనుకూల పవనాలు వీస్తున్నట్టుగానే ఉంది. వీరిద్దరికీ ఎల్‌జేపీ రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ జత కట్టడంతో ఎన్టీయే ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్ష ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ జైల్లో ఉండడంతో మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు పెద్దగా అనుకూలంగా లేవు.

జార్ఖండ్‌లో కాంగ్రెస్‌ నేతృత్వంలో మహాగఠ్‌బంధన్‌ గట్టిపోటీయే ఇస్తోంది. మొత్తం 14 సీట్లకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందింది. అయితే కాంగ్రెస్, జేఎంఎం, బాబూలాల్‌ మరాండీకి చెందిన జేవీఎం, ఆర్‌జేడీ చేతులు కలపడంతో మోదీ దూకుడికి కళ్లెం పడే అవకాశముంది. గత ఎన్నికల మాదిరిగా రాష్ట్రాలకు రాష్ట్రాల ను క్లీన్‌ స్వీప్‌ చేయలేకపోయినా కొత్త రాష్ట్రాల్లో పట్టు బిగించడం, కొత్త మిత్రులందర్నీ చేరదీయడం ద్వారా రెండోసారి ప్రధాని పీఠం మోదీయే చేజిక్కించుకుంటారని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సట్టా బజార్‌లోనూ మోదీ సత్తా  
లోక్‌సభ ఫలితాలకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండగా సట్టా బజార్‌లో పందెంరాయుళ్లు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మోదీకి అనుకూలంగా కోట్లలో బెట్టింగ్‌లు కాస్తున్నారు. బుకీల అంచనాల ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే  

రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలకు గాను గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ సారి బీజేపీకి 18 సీట్లు వస్తాయని అత్యధికులు పందెం కాస్తున్నారు.  
     యూపీ : 41 స్థానాలు  
     మధ్యప్రదేశ్‌ : 20–22 స్థానాలు
     గుజరాత్‌ : 22–24 సీట్లు
     బిహార్‌ 12–14 స్థానాలు
  
 (పోటీ చేసిన స్థానాలు 17)
     పశ్చిమబెంగాల్‌ : 8–11  
     హరియాణా : 7–9
     ఢిల్లీ : 5–7 సీట్లు
     మహారాష్ట్రలో
    బీజేపీ–శివసేనకు కలిసి: 31–34 సీట్లు  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు