టీడీపీలో భారీ సంక్షోభం!

20 Jun, 2019 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. తోట సీతారామలక్ష్మి కూడా టీడీపీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో రవీంద్రకుమార్‌ మినహా మిగిలిన వారందరూ బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా బీజేపీలో చేరతారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. దాదాపు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దేని గురించి చర్చించారనేది వెల్లడి కాలేదు. (చదవండి: నిట్టనిలువుగా చీలనున్న టీడీపీపీ)

మరిన్ని వార్తలు