రెడ్‌జోన్‌ ప్రాంతాల్లో నాలుగో విడత సర్వే

23 Apr, 2020 04:29 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. చిత్రంలో సుచరిత, మోపిదేవి

రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు

చంద్రబాబు చిల్లర రాజకీయాలు మానుకోవాలి

మంత్రులు ఆళ్ల నాని, మోపిదేవి, సుచరిత  

సాక్షి, అమరావతి బ్యూరో: రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో నాలుగో విడత ఇంటింటి సర్వే చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఈ సర్వేలో ఒక డాక్టర్‌ ఉంటారని, ఎవరికైనా కోవిడ్‌ అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేస్తామని చెప్పారు. గుంటూరు కలెక్టరేట్‌లో హోం మంత్రి మేకతోటి సుచరిత, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, ఎమ్మెల్యే మద్దాళి గిరి, కలెక్టర్‌ ఐ.శామ్యూల్‌ ఆనంద్‌కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌లతో కలసి ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..

► రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఈ జిల్లాల్లో ఎక్కువ టెస్టులు చేసేందుకు వీలుగా క్లియా మిషన్లు పంపాం. వాటితో రోజుకు దాదాపు వెయ్యికిపైగా టెస్టులు చేయవచ్చు.
► రెడ్‌జోన్‌లలో ఫీవర్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నాం. క్వారంటైన్‌ సెంటర్‌లపై ఉన్న అపోహలు తొలగించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
► రెడ్‌జోన్‌లలో సూపర్‌ శానిటేషన్‌ జరిపిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులతోపాటు కోవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న వారందరికీ భద్రతా పరికరాలు అందజేస్తున్నాం.
► రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరలేదు.

చంద్రబాబువి చిల్లర రాజకీయాలు: మోపిదేవి
► ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ మాజీ సీఎం చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. తనకు అవకాశం ఇస్తే కరోనాను చాపచుట్టేస్తానని చెప్పడం హాస్యాస్పదం. ఆయన సామర్థ్యం తెలిసే ప్రజలు పక్కన పెట్టారు.
► రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకుంటున్నాం.

ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి: హోం మంత్రి సుచరిత
► ఇలాంటి కష్ట సమయంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం పలు విధాలుగా కృషి చేస్తోంది.
► డ్వాక్రా మహిళల వడ్డీ మాఫీ కోసం రూ. 1,100 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

మరిన్ని వార్తలు