‘చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తాం’

20 Mar, 2018 14:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండానే మంగళవారం కూడా లోక్‌సభ వాయిదా పడింది. విపక్ష ఎంపీల నిరసనల మధ్య సభ బుధవారానికి వాయిదా పడింది. వాయిదా అనంతరం బయటికొచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ జనరల్‌ సెకట్రరీకి నాలుగో సారి నోటిసులు ఇచ్చారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హోదాపై చర్చ జరిగే వరకు వదిలిపెట్టమని స్పష్టం చేశారు. సభలో చర్చ జరిగి, రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు నోటీసులు ఇస్తూనే ఉంటామని తెలిపారు. 

ఎంపీ మేకపాటి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్థి సాధ్యమని, ప్రత్యేక హోదా సంజీవిని కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీ కావాలన్నారు. ఇప్పుడు మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. ఇదంతా వైఎస్‌ జగన్‌ పోరాటానికి వస్తున్న ప్రజాదరణను చూసే బాబు యూటర్న్‌ తీసుకున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల హక్కు, అది సాధించేంత వరకూ పోరాటం చేస్తునే ఉంటాం అని అన్నారు. 

ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవాడానికి చంద్రబాబే ప్రధాన కారణం అని, ఆయన అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, రెండు, మూడేళ్ల కొకసారి ఆయన భాగస్వామిని మారుస్తారని విమర్శించారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైన తొక్కుతారని, ఇలాంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు.

మరిన్ని వార్తలు