ఇసుకతో కోట్లు కొల్లగొట్టిన పచ్చనేతలు

4 Apr, 2019 12:50 IST|Sakshi

సాక్షి, అమరావతి : కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన దానికి భిన్నంగా ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా బాబు మంత్రి వర్గంలో ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు తన బినామీలతో ఇసుకను కొల్లగొట్టి రూ. వేల కోట్లు గడిం చారు. ఉచితం పేరుతో ఇసుకను క్వారీల నుంచి అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి రాత్రికి రాత్రే అనేక మంది అక్రమార్కులు లక్షాధికారులుగా మారారు.

క్వారీల వద్ద ఇసుక లేకపోయినా పంటచేలు, గ్రామాలు, పట్టణాల్లోని వివిధ ప్రాం తాల్లో ఖాళీగా ఉన్న ప్రాంతాలు ఇసుక గుట్టలతో దర్శనమిస్తున్నాయి. పగలు గుట్టలు కనిపిస్తాయి. రాత్రికి రాత్రే మాయమవుతాయి. అక్కడ గుట్టలు ఉన్నట్లు అధికారులకు తెలిసినా వారు అటువైపు కనెత్తి చూడరు. ఎందుకంటే వారికి అందవలసిన ముడుపులు చేరుతున్నాయి. 

జిల్లాలో ఇబ్రహీంపట్నం, నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, తోట్లవల్లూరు, కంకిపాడు, పెనమలూరు, విజయవాడ రూరల్‌ తదితర ప్రాంతాల్లో అధికారికంగా అనుమతి ఉన్న ఇసుక క్వారీలు 10 ఉన్నాయి. ఇందులో ఇబ్రహీంపట్నం లో ఫెర్రీ, గుంటుపల్లి క్వారీలు ఉండగా.. జగ్గయ్యపేట మండలంలో వేదాద్రి రావిరాల, శెనగపాడు, లింగాల క్వారీలు ఉన్నాయి. వీటితోపాటు నందిగామ నియోజకవర్గ పరిధిలో కృష్ణా, మునేటి పరీవాహక గ్రామాల నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

ఈ క్వారీలన్నింటిపైనా మంత్రి దేవినేని అనుచరుల పెత్తనం నడుస్తోంది. దేవినేని అనుచరులు ముం దుగానే తమ సొంత వాహనాలతో ఇసుకను భారీగా నిల్వ చేశారు. రాత్రి సమయంలో జిల్లా వ్యాప్తం గా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. 
 
ఐదు యూనిట్ల లారీ  రూ. 20 వేలు పైగానే.. 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక ఉచితం. కానీ జిల్లాలో ప్రస్తుతం ఐదు యూనిట్ల లారీ ఇసుక ధర దూరాన్ని బట్టి రూ. 20 వేలు పైగానే పలుకుతోంది. ఇదంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించినా గతం నుంచి కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉచిత ఇసుక అనే పదం వినడానికే తప్ప ఆచరణలో అమలు కాలేదని చెప్పవచ్చు.

గొల్లపూడి గ్రామ శివారు సూరాయిపాలెం ఇసుక రీచ్‌లో ఇసుకను టీడీపీ నాయకులు  ఇష్టారాజ్యంగా విక్రయిస్తూ రూ. లక్షలు ఆర్జి స్తున్నారు.   ఇబ్రహీంపట్నం గుంటుపల్లి ఇసుక క్వారీలో మంత్రి అనుచరులు నిబంధనలకు విరుద్ధంగా నది నుంచి అక్రమంగా డ్రెడ్జింగ్‌ యంత్రాలతో ఇసుక తోడేస్తున్నారు.

ప్రతిరోజూ 650 లారీలు!
 నిత్యం 650 లారీలకు సరిపడా 4 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడేసి.. లారీలతో రవాణా చేస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోనూ వేదాద్రి రావిరాల, శెనగపాడు, లింగాల క్వారీల నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య అనుచరులు నిత్యం వందలాది లారీలు, ట్రాక్టర్లతో ఇసుకను తెలంగాణ రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇసుక క్వారీలు బడాబాబుల కనుసన్నల్లో నడుస్తుండటంతో సామాన్య మధ్యతరతి వర్గాలకు ఉచిత ఇసుక అందని ద్రాక్షలా మారింది. దీని ప్రభావం నిర్మాణ రంగంపై గణనీయంగా పడుతోంది.    ఇసుకాసురులు ఇసుకను అధిక ధరలకు విక్రయాలు సాగిస్తూ రూ. కోట్లు అక్రమార్జనకు పాల్ప డుతున్నారు. 

అందినంత దోచేశారు!

ఇసుకను పిండి తైలం తియ్యవచ్చన్న నానుడిని టీడీపీ నేతలు వంటబట్టించుకున్నారు. దాన్ని కొంచెం మార్చేసి తైలం బదులు నగదును పిండేశారు.  ఇసుకను తవ్వేసి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఉచిత ఇసుక విధానం అర్థమే మార్చేశారు. అడ్డగోలుగా ఇసుక తవ్వేసి కోట్లు  తెలుగు తమ్ముళ్లు కోట్లు మూటగట్టారు.

విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని గ్రామాల వెంబడి కృష్ణానది ఏటి పాయ ప్రవహిస్తుంది. పెద పులిపాక, యనమలకుదురు, చోడవరం, కంకిపాడు మండలం మద్దూరు ప్రాంతాల్లో ఇసుక క్వారీలు ఉన్నాయి.

2014 ఎన్నికల తరువాత అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాల ద్వారా ఇసుక అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పెనమలూరు మండలం పెద పులిపాక కేంద్రంగా ఉన్న క్వారీలో అమ్మకాలు చేపట్టారు. నిత్యం 400 నుంచి 600 ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను అమ్మి సొమ్ము చేసుకున్నారు. 

పేటలో రూ. వెయ్యి కోట్లకు పైగా..

మూడున్నరేళ్లలో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు రూపాయి పెట్టుబడి లేకుండా అక్రమ ఇసుక వ్యాపారం ద్వారా కోట్లాది రూపాయలు వెనుకేసుకున్నారు. జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లోరి వేదాద్రి–రావిరాల, సుబ్బాయిగూడెం, లింగాల ఇసుక క్వారీల నుండి అక్రమ ఇసుక రవాణాను అడ్డుఅదుపు లేకుండా చేశారు.  

ఈ ప్రాంతం తెలంగాణాకు సరిహద్దులో ఉండటంతో టీడీపీ నాయకులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నాయకులు యథేచ్ఛగా రవాణా సాగిం చారు. రోజుకు వంద ట్రక్కులకు పైగా తెలంగాణాకు తరలించారు. అంతే కాకుండా రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ట్రాక్టర్లతో డంప్‌ చేసి రాత్రి వేళల్లో లారీల్లో తెలం గాణ కు తరలించారు. మూడున్నరేళ్లలోనే వెయ్యి కోట్లకు పైగానే ఇసుక అక్రమ రవాణా సాగించారు.

ఇసుక ధర భారమే
ఉచిత ఇసుక విధానం కేవలం అధికార పార్టీ నేతలకే. సామాన్యుడికి అందుబాటులో లేదు. అధికార నేతలు, కొందరు దళారులకు మాత్రమే ప్రయోజనం చేకూరింది. పేదలు మాత్రం ఇల్లు కట్టాలన్నా, మరుగుదొడ్లకు ఇసుక తేవాలన్నా కూడా అధిక ధరకు ఇసుక తెచ్చుకోవాల్సిన పరిస్థితి. 
– కొండవీటి వెంకట సుబ్బారావు, మంతెన 

మరిన్ని వార్తలు