ఢిల్లీ మహిళలకు శుభవార్త

4 Jun, 2019 04:25 IST|Sakshi

బస్సు, మెట్రోల్లో వారికి ఉచిత ప్రయాణం

ఢిల్లీ సీఎం ప్రకటన

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఢిల్లీ శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానిలోభాగంగా రాజధానిలో బస్సు, మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. ‘ఢిల్లీలో డిటీసీ, క్లస్టర్‌ బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వారి ప్రయాణ ఖర్చుల్ని ప్రభుత్వం భరిస్తుంది’ అని సోమవారం ఢిల్లీలో కేజ్రీవాల్‌ చెప్పారు. 2, 3 నెలల్లో దీన్ని అమలు చేస్తామన్నారు.

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో 7 నుంచి 8 వందల కోట్ల భారం పడుతుందన్నారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి వారం రోజుల్లోగా నివేదిక అందజేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీ మెట్రోలో రోజూ పాతిక లక్షల మంది ప్రయాణిస్తున్నారని,  ఉచిత ప్రతిపాదన వల్ల ప్రయాణికుల సంఖ్య మరో లక్ష పెరిగే అవకాశం ఉందన్నారు. నగరంలో 1.50 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లు ఆమోదించామని తెలిపారు.ఈ డిసెంబరు నాటికి 70వేల కెమెరాలు అమర్చుతామన్నారు. కాగా, ఉచిత ప్రయాణ ప్రతిపాదనపై వ్యాఖ్యానించడానికి ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ నిరాకరించింది.

మరిన్ని వార్తలు