బహుముఖ పోటీ

4 May, 2019 11:36 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పరిషత్‌ ఎన్నికల్లో ఈసారి ఎనలేని పోటీ కనిపిస్తోంది. కొన్ని స్థానాల్లోనే ద్విముఖ పోటీ ఉంది. తొలి, రెండో విడత ఎన్నికలు జరిగే చాలా చోట్ల ఇదే పరిస్థితి. తొలి విడత ఎన్నికలు జరిగే 93 ఎంపీటీసీ స్థానాల్లో... 18 చోట్ల మాత్రమే ఇద్దరు అభ్యర్థులు నువ్వా– నేనా అనే రీతిలో తలపడుతున్నారు. ఇక మిగిలిన అన్ని చోట్లా తీవ్ర పోటీ నెలకొంది. మిగిలిన స్థానాల్లో కనీసం ముగ్గురు, గరిష్టంగా ఏడుగురు అభ్యర్థులు తలపడుతుండటం గమనార్హం. మంచాల మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కనీసం ఒక్క స్థానంలోనూ ద్విముఖ పోటీ లేదు. ప్రతీ చోట ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యర్థులు కదనరంగంలో నిలిచారు.

శంకర్‌పల్లి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. సంకేపల్లి ఏకగ్రీవమైంది.  గాజులగూడలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీపడుతుండగా.. మిగిలిన స్థానాల్లో ముగ్గురు, నలుగురు చొప్పున గెలుపు కోసం శ్రమిస్తున్నారు. రెండో దశ ఎన్నికలు జరిగే 89 ఎంపీటీసీలు, 8 జెడ్పీటీసీల్లో స్థానాల్లోనూ తీవ్ర పోటీ నెలకొంది. 17 ఎంపీటీసీ స్థానాల్లో మాత్రమే ఇద్దరు చొప్పున బరిలో నిలవగా.. మిగిలిన వాటిల్లో గరిష్టంగా ఆరుగురు అభ్యర్థులు తలపడుతున్నారు.
 
పెరిగిన చైతన్యం..   
గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి అటు జడ్పీటీసీ, ఇటు ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో గెలుపు అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అభ్యర్థులు చెమటోడ్చితేనే విజయతీరాలకు చేరేది. ఒకప్పుడు ప్రాదేశిక ఎన్నికల్లో ఇద్దరు లేదా ముగ్గురు నాయకులు పోటీ పడిన సందర్భాలు మాత్రమే అధికంగా ఉండేవి. అన్ని పార్టీలో నాయకుల మధ్య పదవుల కోసం పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ఈ సారి గణనీయంగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. గ్రామాల్లో తమకున్న రాజకీయ పలుకుబడితోపాటు ప్రజాప్రతినిధిగా ఎన్నికై రాజకీయాల్లో సత్తాచాటాలని అందరూ ఉవ్విళ్లూరుతున్నారు.

రాజకీయాలను చాలామంది స్టేటస్‌గా భావిస్తుండగా.. ఇంకొందరు గౌరవంగా ఫీలవుతున్నారు. అలాగే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అనుకుంటున్నారు. పైగా సమాజంలో క్రమంగా రాజకీయ చైతన్యం విస్తృతంగా పెరుగుతూ వస్తోం ది. దీనికితోడు గ్రామాలకు తమ వంతుగా ఏదైనా చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల బరిలో దిగుతున్నా రు. ముఖ్యంగా గత కొంతకాలంగా యువత ఎన్నికల్లో పోటీ పట్ల ఆసక్తి కనబర్చుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి వారు కొందరు పార్టీ పరంగా బరిలోకి దిగుతుండగా.. ఇంకొందరు స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న పరిషత్‌ పోరులో అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు.

మరిన్ని వార్తలు