వైస్‌ చైర్మన్‌ పదవికి పోటాపోటీ

6 Jun, 2019 10:47 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మండల, జిల్లా పరిషత్‌ ఫలితాలు తేలడంతో అందరి దృష్టి ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్‌ స్థానాలపై పడింది. జెడ్పీ చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ తీగల అనితారెడ్డికి టీఆర్‌ఎస్‌ అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆమె ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. ఇక.. వైస్‌ చైర్మన్‌ పదవిపై ఆశావహులు గురిపెట్టారు. ఈ స్థానానికి రిజర్వేషన్‌తో సంబంధం లేకపోవడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సొంత అన్న కుమారుడు పట్నం అవినాష్‌రెడ్డి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే పట్నం ఫ్యామిలీ నుంచి నలుగురికి పదవులు దక్కాయి.

కొడంగల్‌కు నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తుండగా.. మహేందర్‌రెడ్డి తాజాగా ఎమ్మెల్సీగా నెగ్గారు. అలాగే వికారాబాద్‌ జిల్లా కోట్‌పల్లి నుంచి జెడ్పీటీసీగా గెలుపొందిన ఈయన సతీమణి సునితారెడ్డిని ఆ జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవికి ఖరారు చేశారు. అంతేగాక షాబాద్‌ నుంచి అవినాష్‌రెడ్డి జెడ్పీటీసీగా నెగ్గారు. ఈ క్రమంలో అవినాష్‌కు జెడ్పీ వైస్‌చైర్సన్‌గా అవకాశం ఇస్తారా? అనే అంశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన వైపు మొగ్గుచూపితే పార్టీలో అసంతృప్తి వ్యక్తమయ్యే పరిస్థితులు ఉన్నాయని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారు. పార్టీని ఆది నుంచి నమ్ముకున్న వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కుమారుడు శ్రీకాంత్‌ కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎమ్మెల్యే సతీమణి కూడా నవాబుపేట జెడ్పీటీసీగా, రెండో కోడలు ఎంపీటీసీగా గెలుపొందారు. ఈ కుటుంబంలోనూ నలుగురికి పదవులు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో వైస్‌ చైర్మన్‌ పదవిని కూడా కట్టబెడతారా అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.
 
రేసులో వెంకటేష్‌ కూడా.. 
తలకొండపల్లి జెడ్పీటీసీగా ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్‌బీ) తరఫున అత్యధిక మెజారిటీతో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించిన ఉప్పల వెంకటేశ్‌ కూడా రేసులో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏఐఎఫ్‌బీ నుంచి నెగ్గినప్పటికీ.. ఈయన టీఆర్‌ఎస్‌ పార్టీ సానుభూతిపరుడని తెలుస్తోంది. ఈయనకు వైస్‌ చైర్మన్‌ పదవి ఖరారు చేస్తే గులాబీ కండువా కప్పుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు వెంకటేష్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనికితోడు ఆయన తలకొండపల్లి మండలంలో ఆరు ఎంపీటీసీ స్థానాల్లో తన వర్గాన్ని గెలిపించుకుని సత్తా చాటారు. స్థానిక రాజకీయాల వల్ల టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ లభించకున్నా ఏఐఎఫ్‌బీ నుంచి పోటీచేసి తనకున్న మంచిపేరుతో మెజారిటీ స్థానాలను సొంతం చేసుకున్న వెంకటేష్‌ పట్ల అధికార పార్టీ సానుకూలంగా స్పందిస్తుందని ఆయన అనుయాయులు నమ్మకంతో ఉన్నారు. వీరితోపాటు మరికొందరు కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ఇలా ఆశా వహ అభ్యర్థులు తమ మార్గాల్లో వైస్‌ చైర్మన్‌ పదవి కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

తెరమీదకు బీసీ నినాదం 
జెడ్పీ పీఠం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైస్‌ చైర్మన్‌ పదవిని బీసీలకు కేటాయించాలన్న డిమాండ్‌ తెరపైకి వస్తోంది. బీసీ అంశానికి అధిష్టానం కట్టుబడి ఉంటే.. ప్రధానంగా వినిపిస్తున్న అవినాష్, శ్రీకాంత్, వెంకటేష్‌ పేర్లను పక్కన పెట్టినట్లే. అవినాష్‌ది రెడ్డి సామాజిక వర్గం కాగా, శ్రీకాంత్‌.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక వెంకటేష్‌ ఆర్యవైశ్యులు. ఈ నేపథ్యంలో ఇతరుల పేర్లు పరిశీలనలోకి వచ్చే వీలుంది. తద్వారా ఆశావహుల సంఖ్య కూడా భారీగానే ఉండనుంది. మొత్తం మీద జెడ్పీ చైర్‌ పర్సన్‌ ఎన్నిక జరిగే 8వ తేదీనే వైస్‌ చైర్మన్‌ను కూడా ఎన్నుకుంటారు. అంటే ఏదో తేదీలోగా వైస్‌ చైర్మన్‌ పదవికి పార్టీ ఎవరిని ఖరారు చేస్తుందో తేలనుంది. అధిష్టానం ఖరారు చేసిన వ్యక్తికే ఆ పదవి దక్కుతుందని పార్టీ సీనియర్‌ నేతలు పేర్కొంటున్నారు.

ఎంపీపీ పీఠాలకు బేరాలు.. 
మండల రాజకీయాల్లో కీలకమైన ఎంపీపీ పదవికి తీవ్ర పోటీ కనిపిస్తోంది. అధికార పార్టీకి తొమ్మిది మండలాల్లో స్పష్టమైన మెజారిటీ రావడంతో ఆ ఎంపీపీ స్థానాలు అధికార పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది. అయినా కొందరు నేతలు క్యాంప్‌ రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. దురదృష్టం వెంటాడితే ఏదైనా జరగొచ్చన్న ముందస్తు చర్యగా ఎంపీటీసీలతో శిబిరం నిర్వహిస్తూ చేజారకుండా జాగ్రత్త వహిస్తున్నారు. ఇక హంగ్‌ ఏర్పడిన 11 స్థానాలనూ సొంతం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. ఈ మండలాల్లో ఎంపీపీ స్థానాలను సాధించడంలో.. స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలు కీలకంగా మారుతున్నారు. వీరిని ఆకర్షించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోపక్క చేవెళ్ల, మంచాల ఎంపీపీ స్థానాలను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ కూడా రంగంలోకి దిగింది. వీరి ఎన్నికలో కీలకమైన ఎంపీటీసీలను తమవైపు తిప్పుకునేందుకు శాయశక్తులా ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇలా ఆయా పార్టీల అవసరాలను గమనించిన కొందరు ఎంపీటీసీలు తమ కోరికల చిట్టాను వారి ముందు పెడుతున్నారు. తమకు ఎంపీపీ లేదా వైస్‌ ఎంపీపీ పదవులు ఇస్తేనే ముందుకు వస్తామని నిర్మొహమాటంగా చెబుతున్నారు. మొత్తం మీద ఎంపీసీల ఎన్నిక సరవత్తరంగా మారుతోంది.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు