కశ్మీర్‌పై ‘కమల’వ్యూహం 

24 Jun, 2018 02:38 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌ సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఉన్నట్టుండి బీజేపీ ఎందుకు బయటకు వచ్చింది..? కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన ద్వారా కాషాయదళం సాధించేదేమిటి..? వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ స్థాయిలో ‘భవిష్యత్‌ రాజకీయ నష్టాల’ నివారణలో భాగంగానే జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలిగిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క కశ్మీర్‌కే పరిమితం కాకుండా విస్తృత రాజకీయ ప్రయోజనాలు ఆశించే ఈ నిర్ణయం తీసుకుందని అంచనా వేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలకు జమ్మూకశ్మీర్‌ అనేది ఓ భావోద్వేగాన్ని రగిలించే అంశంగా నిలుస్తున్న విషయం తెలిసిందే. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే ఈ వర్గాలను కాపాడుకునే చర్యల్లో భాగంగానే బీజేపీ ఈ అడుగు వేసిందని భావిస్తున్నారు.

గవర్నర్‌ పాలన రూపంలో అంతర్గత భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా జమ్మూకశ్మీర్‌లో, పాకిస్తాన్‌ సరిహద్దువ్యాప్తంగా గట్టి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మూడేళ్ల పీడీపీ–బీజేపీ పాలనలో కశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాలు, వాటికి మద్దతు తెలిపే సానుభూతిపరుల పట్ల అనుసరించిన వ్యూహాలకు పూర్తి భిన్నమైన కార్యాచరణను ఇప్పుడు కేంద్రం చేపట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణ, నియంత్రణలోనే జమ్మూకశ్మీర్‌ ఉంటే బీజేపీకి రాజకీయంగా లాభిస్తుందనేది ఆ పార్టీ అభిప్రాయం. 

పాలనపై పూర్తి నియంత్రణ.. 
కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన ద్వారా బీజేపీ ఆ రాష్ట్రంపై పూర్తిపట్టు సాధించింది. అక్కడి పరిస్థితులను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. మిలిటెంట్ల కార్యకలాపాలు అణచివేసేందుకు భద్రతాపరంగా కఠిన చర్యలకు గవర్నర్‌ పాలనను ఉపయోగించుకోనుంది. చొరబాట్లను అడ్డుకునేందుకు సైనిక చర్యలతో పాటు సానుభూతిపరులపై నిఘా పెరుగుతుంది. సైన్యం, ఇతర భద్రతా దళాలు స్వేచ్ఛగా తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు గవర్నర్‌ పాలన ఉపయోగపడుతుంది. వీటికి రాజకీయపరమైన పరిమితులు అడ్డుగా నిలిచే అవకాశముండదు. తీవ్రవాదులు, వారి సానుభూతిపరుల కార్యకలాపాల నియంత్రణకు సైనిక చర్యలకు దిగడం ద్వారా కశ్మీర్‌లో వేర్పాటువాద శక్తులపై పైచేయి సాధించిన సంకేతాలు ఇవ్వనుంది. దేశవ్యాప్తంగా జాతీయ సమైక్యత, జాతీయ భావజాల నినాదాలు ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా రాజకీయ ఫలాలు పొందాలని భావిస్తోంది. ‘కశ్మీర్‌లో శాంతిస్థాపన’నినాదాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా బీజేపీ మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు భావిస్తున్నారు. 

పెరగనున్న సైనిక చర్యలు.. 
నిఘా వర్గాల సమాచారాన్ని ఉపయోగించడంతో పాటు, కశ్మీర్‌ పోలీసులతో మరింత సమన్వయంతో పనిచేయడం ద్వారా భారత సైన్యం కచ్చితమైన లక్ష్యాలతో కార్యాచరణకు దిగే అవకాశాలున్నాయి. గత మహబూబా ముఫ్తి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర నిఘా వర్గాలు తమకు పూర్తి సహకారం అందించలేదన్న అభిప్రాయం సైన్యానికి ఉంది. ఇప్పుడు సైన్యం ఉగ్రవాద అణచివేత కార్యక్రమాలను ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే సైనిక చర్యలకు ప్రతిగా హింసాత్మక ఘటనలు కూడా పెరగవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉగ్రవాద సంస్థలు మిలిటెంట్‌ రిక్రూట్‌మెంట్‌ను విస్తృతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పదేళ్లలోనే అత్యధిక హింసాత్మక ఘటనలు జరిగిన సంవత్సరంగా 2018 మిగలొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఆరు నెలల్లోనే 95 మంది తీవ్రవాదులు హతమయ్యారు. హింసాత్మక ఘటనల కారణంగా 40 మంది భద్రతా సిబ్బంది, 38 మంది పౌరులు మరణించారు.  

మరిన్ని వార్తలు