కుల ప్రభావం లేనప్పుడే స్వరాజ్యం 

10 Jan, 2020 04:15 IST|Sakshi

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి

రాజేంద్రనగర్‌: మహాత్మాగాంధీ చెప్పినట్లుగా గ్రామ స్వరాజ్యం రావాలంటే ఎన్నికల్లో డబ్బు, కుల, మత ప్రభావం ఉండకూడదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల అధికారులకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషనర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. గురువారం రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్డీ)లో అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రస్తుతం గ్రామాల నుంచి యువకులు, ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారని, ఎన్నికల సమయంలో గ్రామాలకు వచ్చి ఎన్నిక అవుతున్నారన్నారు. అనంతరం పట్టణాలకే పరిమితం కావడంతో గ్రామాలు అభివృద్ధి జరగడం లేదని తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సులో కమిషనర్లు అంతా సమగ్రంగా చర్చించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు, సలహాలను అందించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి, ఎన్‌ఐఆర్డీ డైరెక్టర్‌ డబ్ల్యూఆర్‌ రెడ్డి, కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సునీల్‌కుమార్, ఏకే చౌహాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు