‘వినోద్‌ పార్టీ మారరు’

18 Oct, 2018 05:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం అందరం కలిసి పని చేస్తామని, మాజీ మంత్రి జి.వినోద్‌ పార్టీ మారబోరని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ స్పష్టంచేశారు. వినోద్‌ పార్టీ మారతారనేది కేవలం మీడియా సృష్టి అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నేతలు రాకేశ్‌కుమార్, కిషన్‌రావు, రంగారెడ్డిలతో కలిసి సుమన్‌ తెలంగాణభవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టో ప్రకటించడంతో ప్రజలలో సంతోషం పెల్లుబుకుతోంది.

నిరుద్యోగ భృతి రూ.3,016 ఇస్తామని చెప్పడంతో ఉద్యమంలో పాల్గొన్న వేలాది మంది యువతకు ఊరట కలిగించే అంశం. అలాగే రైతుబంధు మొత్తాన్ని ఎకరానికి రూ.10వేలకు పెంచడం హర్షణీయం. రైతులకు రూ.16 వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. సీఎం కేసీఆర్‌ రైతు బిడ్డే కాబట్టి మరోసారి రూ.లక్ష రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. మా పాక్షిక మేనిఫెస్టోతో కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాంగ్రెస్‌ మేనిఫెస్టోనే విడుదల కాలేదు. కాపీ కొట్టే ప్రసక్తి ఎక్కడిది? కాంగ్రెస్‌ నాయకులది ఒక్కొక్కరిదీ ఒక్కోదారి. వాళ్ల మేనిఫెస్టోలో ఏముంటుందో వారికే తెలియదు’’అని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు