పేదల రాజ్యం రావాలి ప్రజాగాయకుడు గద్దర్‌

27 Oct, 2018 03:02 IST|Sakshi

చింతకాని: రాష్ట్రంలో దొరల రాజ్యం నడుస్తోందని, అది పోయి పేదల రాజ్యం రావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన లేదన్నారు. ప్రజల ఇబ్బందులను చూసి మీ వద్దకు వచ్చానని చెప్పారు.

మార్పు కోసం ప్రయత్నించాలని యువతకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ హక్కులను రాష్ట్ర పాలకులు పక్కన పెట్టి పాలన చేస్తున్నారని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తానూ ఏకమవుతానని రాహుల్‌గాంధీ చెప్పిన మాట లను విని రాష్ట్రంలో మార్పు తెచ్చేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నానని గుర్తుచేశారు.

వన్‌ మ్యాన్‌.. వన్‌ ఓట్‌.. వన్‌ వ్యాల్యూ నినాదంగా రాష్ట్రాన్ని దోపిడీ చేసే దొరల రాజ్యానికి ఓట్ల విప్లవంతో గుణపాఠం చెప్పాలని సూచించారు. తెలంగాణలో కొనసాగిన దొరల పాలన.. ప్రజల జీవవ స్థితిగతులపై గద్దర్‌ ఆడిన ఆట, పాడిన పాట సభికులను ఆకట్టుకున్నాయి. సభలో భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు