ఓడిపోయే బాబుకు సౌండెక్కువ

17 Apr, 2019 04:12 IST|Sakshi

ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి

బాబు చట్టూ దొంగల ముఠా

టెక్నాలజీ గురించి ఆయనకు ఏం తెలుసు?

రాయలసీమ ప్రజల గొంతు కోశారని ధ్వజం

అన్ని వర్గాలను మోసం చేసిన చంద్రబాబు: కోన రఘుపతి   

సాక్షి,సిటీబ్యూరో: గత ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికలు ముగిశాక ఇప్పుడు వ్యవస్థల గురించి,  ఈవీఎంల గురించి, ఎలక్షన్‌ కమిషన్‌ గురించి మాట్లాటం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. తన ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని తెలుసుకొన్న చంద్రబాబు రాష్ట్ర రాజధాని, దేశ రాజధాని ప్రాంతాల్లో నానా యాగీ చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలంలో మరో ఎమ్మెల్యే కోన రఘుపతితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఐటీని పరిచయం చేసింది తానే అని గత పదిహేను సంవత్సరాల నుంచి చంద్రబాబు చెబుతున్న మాటలతో ప్రజలు విసిగి పోయారన్నారు. ఇప్పుడు ఓడిపోతున్నానని తెలిసే చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా నానా యాగీ చేసిన బాబు తన చేష్ట ద్వారా ఎంతగా దిగాజారారో అర్థమౌతోందని పేర్కొన్నారు. ఒకవైపు తమకు 130 సీట్లు వస్తాయంటూనే మరోవైపు ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లపై నమ్మకం లేదంటూ వితండ వాదం చేస్తున్నారన్నారు. చంద్రబాబు తీరును చూసి జాతీయ నేతలు సైతం అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ఓడే బాబు సౌండెక్కువ లాంటి సామెతలు పట్టుకొస్తున్నాయని చెప్పారు.

దోపిడీదారులంతా చంద్రబాబు చుట్టూ ...
దోపిడీ దారులందరూ చంద్రబాబు పక్కనే ఉన్నారన్నారని శ్రీకాంతరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో దొంగనోట్లు ముద్రించిన రామకృష్ణ గౌడ్‌ చంద్రబాబు మనిషేనని గుర్తు చేశారు. స్టాంప్‌ కుంభకోణంలో అప్పట్లో చంద్రబాబు కేబినెట్‌లోని నలుగురు మంత్రుల ప్రమేయం ఉందన్నారు. ఎర్రచందనం దొంగలు అందరూ చంద్రబాబుతోనే ఉన్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన టాప్‌ 100 మందిలో సుజనాచౌదరి సహా ఎక్కువ మందికి చంద్రబాబుతో సంబంధాలు ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజల డేటా చోరీ చేసిన వ్యక్తి అశోక్‌ చంద్రబాబు మనిషేనని అన్నారు. తిరుపతి – తిరుమల, విజయవాడ ఆలయాల్లో దొంగతనాలు జరిగింది బాబు హయాంలోనే అని చెప్పారు.  

సీమ వాసుల గొంతు కోసిన బాబు...
వర్షపాతానికి సంబంధించి రాష్ట్రానికి మంచిరోజులు రాబోతున్నాయని శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. ఇది జగన్‌ పరిపాలన వస్తుందనేందుకు శుభసంకేతమన్నారు.  రాయలసీమకు నీళ్లు ఇచ్చానని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పారు. ధైర్యం ఉంటే రాయలసీమకు రండి పల్లెల్లో తిరుగుదామని అని శ్రీకాంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. బిందె నీరు తాగేందుకు లేక రాయలసీమలో గ్రామాల ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబును పట్టుకుంటే జాతీయ పార్టీలు కూడా మునిగిపోతాయని, ఈ విషయం ఆయా పార్టీల నేతలు తెలుసుకోవాలన్నారు. నీచరాజకీయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన దేనినేని ఉమ ఓడిపోతానని తెలిసి ఆ భయంతో మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.

గెలుపు ఓటములను హందాగా స్వీకరించే లక్షణం ఉండాలి: కోన రఘుపతి
ఎన్నికల్లో ఓటమైనా.. గెలుపైనా హుందాగా స్వీకరించే లక్షణం నాయకులకు ఉండాలని ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నారు. 2014లో ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ ప్రజాతీర్పును హుందాగా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చున్నారన్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఓడిపోయే ముందుగానే సాకులు వెతుకుతున్నట్లుగా ఉందన్నారు. 2014లో గెలిచినప్పుడు ఈవీఎంలను అంగీకరించిన బాబు ఇప్పుడు ఓటమి తప్పదని బ్యాలెట్‌ పద్ధతి పల్లవి అందుకున్నారన్నారు. బాబుకు అనుభవం ఉందని సీఎం చేస్తే రాష్ట్ర పరువు తీయడమేకాక అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఇరుకున్న బుద్దా వెంకన్న లాంటి వారి విమర్శలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.

మరిన్ని వార్తలు