ఎన్నికల కోసం ఎన్ని తాయిలాలో?

22 Jan, 2019 03:48 IST|Sakshi

నాలుగున్నరేళ్ళుగా చేసిందేంటో?

బీజేపీతో అంటకాగి ఏం సాధించావ్‌?

రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టింది నువ్వేగా..

వ్యవసాయమే దండుగన్న బాబు రైతును ఉద్దరిస్తాడా?

చంద్రబాబుపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజం  

సాక్షి, హైదరాబాద్‌: నాలుగున్నరేళ్లుగా ఏ ఒక్క మంచి పని చేయని చంద్రబాబు, ఎన్నికల ముందు అనేక తాయితాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలను మరోసారి దగా చేసే ఉద్దేశం ఆయనలో స్పష్టమవుతోందని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరల్లేక ఊపిరి ఆగిపోతోందని లబోదిబోమన్నా పట్టించుకోని సర్కార్‌ ఇప్పుడు నెల రోజుల్లో ఎన్నికలొస్తున్నాయని తాయిలాలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ప్రతీ కేబినేట్‌ మీటింగుల్లో భూములను ఎలా మాఫియాలకు కట్టబెట్టాలని, ఇసుకను ఎలా దోచుకోవాలని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం ఎలా అనే దానిపైనే చర్చించారని, ఏనాడూ రైతు సమస్యలపై చర్చించలేదన్నారు.

అధికారంలో ఉన్న వారు ఇప్పటిదాకా ప్రజలకు ఏం చేశామో చెప్పి, మరోసారి అవకాశం ఇస్తే ఎలా మేలు చేస్తామో చెప్పుకుని ఎన్నికలకు వెళ్లడం మంచి పద్ధతి అన్నారు. అందుకు విరుద్ధంగా ఎన్నికల ముందు అన్నీ చేస్తామని చెప్పడం అంటే దగా చేయడమేనన్నారు.  వైఎస్‌ పాలనను ఒక్కసారి గుర్తుచేసుకోమని సూచించారు. ఎన్నికల సమయంలో వైఎస్‌ ఏనాడూ కొత్త తాయిలాలు ప్రకటించలేదన్నారు. ఐదేళ్ల కాలంలో తాను చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి ప్రజలను ఓట్లు అడిగారని తెలిపారు. అలాంటి ధైర్యం బాబుకు ఉందా అని ప్రశ్నించారు. కొంతమంది మంత్రులు తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డికి లేఖలు రాయడాన్ని శ్రీకాంత్‌ రెడ్డి ఆక్షేపించారు. నాలుగేళ్లు కేంద్రంలోని బీజేపీతో అంటకాగి, అధికారాలను అనుభవించారని, అప్పుడు విభజన సమస్యలు కన్పించలేదా అని నిలదీశారు.   

కేసీఆర్‌కు వంగి దండాలు పెట్టిందెవరు?
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీకొస్తే వంగి వంగి నమస్కారాలు పెట్టారని, కండువాలు కప్పి సత్కరించారని, కేసీఆర్‌ యాగానికి హాజరై ఆయన కాళ్లకు మోకరిల్లింది చంద్రబాబు అని శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. ఆరోజే కేసీఆర్‌ను ఏపీ హక్కుల కోసం ఎందుకు నిలదీయలేదన్నారు. వైఎస్‌ జగన్‌ 9 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలోనే పోరాటం చేస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి గుర్తు చేశారు. వ్యవసాయం దండుగన్న మనిషి, రైతులకు ఉచిత కరెంట్‌ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలని ఎద్దేవా చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతు రక్ష పథకం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.   

లోపాయికారి ఒప్పందాలు
బీజేపీ వ్యతిరేక కూటమి అంటూనే చంద్రబాబు ఆ పార్టీతోనే లోపాయికారి ఒప్పందాలకు తెరతీశాడని శ్రీకాంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు. గడ్కరీ రాష్ట్రానికి వస్తే మంత్రులే ప్రశంసలు చేయడం చూస్తుంటే ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని ఒకవైపు, కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని మరోవైపు ఆలోచిస్తూ ఇద్దరితో సంబంధాలు కొనసాగిస్తున్నది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు గురించి ఆయన మామ ఎన్టీఆర్‌ ఏమన్నారో, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఏమన్నారో ఒకసారి యూట్యూబ్‌ చూడాలన్నారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టుల వల్లే సీమకు నీరొస్తోందని, అది వైఎస్‌ పుణ్యమేనని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు