కూతురి దగ్గరికెళ్లినా రాజకీయమేనా?

23 Feb, 2019 03:20 IST|Sakshi

చంద్రబాబుకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సూటి ప్రశ్న 

విదేశాల్లో తన డబ్బుంటే నిరూపించాలని జగన్‌ అన్నప్పుడు ఎందుకు స్పందించలేదు?

చింతమనేని వ్యవహారాన్ని మరుగుపరిచేందుకే ఈ ఆరోపణలు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లండన్‌లోని తన కూతురు దగ్గరకు వెళ్తే హవాలా డబ్బు కోసం వెళ్లారని చంద్రబాబు చెప్పడం దారుణమని ఆ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కన్నకూతురి చదువుల కోసం లండన్‌ వెళితే.. ఇలా మాట్లాడతావా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు లక్ష్యం వైఎస్‌ కుటుంబమేనని, ప్రతి రాజకీయ నాయకుడికీ కుటుంబ వ్యవహారాలుంటాయని.. కానీ చంద్రబాబుకు మాత్రం కుటుంబం విలువలు తెలియవన్నారు. తాను సీఎంననే విషయాన్ని మరిచి ఇష్టానుసారంగా  మాట్లాడుతున్నారని విమర్శించారు. దళితులకు వ్యతిరేకంగా చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యల నుంచి దారి మళ్లించేందుకు హవాలా డబ్బు.. అంటూ చర్చలు పెట్టించారని, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనుకూల చానల్స్‌లో చర్చలు పెట్టించి తనకు అనుకూలంగా మాట్లాడిస్తున్నారన్నారు. విదేశాల్లో తన డబ్బు ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్‌ ప్రకటించారని, చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఆ సవాల్‌ చేశారని, దాన్ని ఎందుకు స్వీకరించలేకపోయారని నిలదీశారు.  

పాకిస్థాన్‌కు మద్దతివ్వడం ఎంతవరకు సమంజసం?
పాకిస్తాన్‌కు చంద్రబాబు మద్దతివ్వడం ఎంతవరకు సమంజసమని, ఆయన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. దేశమంతా అమర జవాన్లకు సంఘీభావం చెబుతుంటే చంద్రబాబు ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దతు తెలపడమేంటని.. చంద్రబాబు మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని, ఇమ్రాన్‌ఖాన్‌ నుంచి ఎంత ముడుపులు తీసుకున్నారని తామూ అనవచ్చని, కానీ తమకు సంస్కారం ఉందన్నారు. చంద్రబాబుపై రాజద్రోహం కేసు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.

రైతు, సైనికుల మరణాలను కూడా బాబు తప్పుదారి పట్టిస్తున్నారు
రెండు రోజుల కిందట గుంటూరు జిల్లాలో పోలీసుల చర్యల వల్ల రైతు కోటయ్య చనిపోయాడని అతని కుటుంబ సభ్యులే చెబుతుంటే.. వైఎస్సార్‌సీపీ కుల రాజకీయాలు చేస్తోందని ఎలా అంటారని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని.. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ప్రశ్నించవద్దా అన్నారు. రైతును చంపినా, సైనికుడిని చంపినా, ఎవర్ని చంపినా ప్రశ్నించకుండా ఉండాలనేది చంద్రబాబు ఉద్దేశంగా ఉందన్నారు. ఆ మరణాలను కూడా చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. దళితులపై చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆయనపై చర్యలు తీసుకోకపోగా.. చంద్రబాబు కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ గతంలో బాబు మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. తన రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తీసుకెళ్లారని, ఇప్పుడు టీడీపీ వారే స్వచ్ఛందంగా తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. 

చంద్రబాబును గద్దె దించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు
హైదరాబాద్‌లో ఆస్తులున్న వారిని బెదిరించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారనే విద్వేషపూరిత విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి విమర్శలు చేయడానికి సిగ్గుపడాలన్నారు. చంద్రబాబు ఎప్పుడెప్పుడు దిగిపోతాడా.. అని ప్రజలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్నారని.. ఎదురుదాడి సిద్ధాంతానికి వెళితే అదే చంద్రబాబును పతనావస్థకు తీసుకెళుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా పట్టించుకోకుండా శవ రాజకీయాలు, కుల రాజకీయాలు చేయడం దారుణమన్నారు. యనమలకు, ఆయన వియ్యంకుడికి, సుజనాచౌదరి, సీఎం రమేష్‌కి ఎన్ని ఆస్తులున్నాయో.. తమ పార్టీలోకి వచ్చిన రవీంద్రబాబుకు ఎన్ని ఆస్తులున్నాయో లెక్క చూద్దామా అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. 

మరిన్ని వార్తలు