‘మహానాడు పేరుతో బాబు, కొడుకుల పిచ్చి మాటలు’

30 May, 2020 20:07 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్ కడప‌: గత ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రెండు పేజీల మేనిఫెస్టోతో సీఎం వైఎస్‌ జగన్ పదవి చేపట్టారని తెలిపారు. మేనిఫెస్టోలోని ప్రతి హామీని నిలబేట్టుకోన్నారని తెలిపారు. ప్రచారం లేకుండానే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ను చూస్తే మనసు పులకరిస్తుందని తెలిపారు. చెప్పిన సమయం కంటే ముందుగా చెప్పిన దాని కంటే మిన్నగా పథకాలు ఆమలు చేశారని తెలిపారు. గత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఎన్ని హామీలు అమలు చేసిందని ప్రశ్నించారు. కరోనా సమయంలో కూడా వైఎస్‌ జగన్ ప్రభుత్వం ఎక్కడ రాజీ పడలేదని చెప్పారు.

హైదరాబాద్‌లో కూర్చోని బురద చల్లుతూ.. మహానాడు పేరుతో బాబు, కొడుకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నాయకులు లాక్‌డౌన్‌ నేపథ్యంలో సహయక చర్యలు చేపడితే అంక్షలు బేఖాతరంటూ కేసులు పెట్టించారని దుయ్యబాట్టారు. నేడు అబ్బాకొడుకులు ర్యాలీలు నిర్వహించి లాక్‌డౌన్‌ ఆంక్షలు అతిక్రమించలేదా అని సూటిగా ప్రశ్నించారు. కరోనా సమయంలో బాబు కొడుకులకు ప్రజా సంక్షేమం పట్టలేదా అని విమర్శించారు. గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో వేల కోట్లు దోచుకుని, 29 మందిని పొట్టన పేట్టుకున్నారని ధ్వజమెత్తారు.

నవరత్నాల్లో 90 శాతం పూర్తి చేయడంతో పాటు వందకు పైగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం సీఎం జగన్‌కే సాధ్యమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇంటి వద్దకే సబ్సిడీతో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని గుర్తు చేశారు. దావోస్ పేరుతో వందల కోట్లు దోచుకున్నారని, కియా వెళ్లిపోతుందని, పరిశ్రమలు రాకూడదని తమ ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. జూలై 8న 27లక్షల మందికి పట్టాలిచ్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇలాంటి ఆలోచనలు గతంలో చేశారా అని ప్రశ్నించారు. 203 జీఓపై రాద్ధాంతం చేస్తున్నారని, పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా దేవినేని ఉమాతో కలిసి చంద్రబాబు ధర్నా చేయలేదా అని ప్రశ్నించారు.

మాటిస్తే ఆ మాట తప్పడం సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంలోనే లేదని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా వేల కోట్లు ఆదా చేశామని గుర్తు చేశారు. ‘సంక్షేమ పథకాల అమలుపై విచారణ చేస్తామని అచ్చెన్నాయుడు మహానాడులో ఛాలెంజ్ చేశారు. ఆయన నియోజకవర్గంలోనే విచారణ చేస్తాం.. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందాయని లబ్దిదారులంటే తల నెక్కడ పేట్టుకుంటావ్’ అని ప్రశ్నించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తారో షెడ్యూల్ ప్రకటించిన నాయకుడు సీఎం జగన్‌ అని అన్నారు. మహనేత వైఎస్సార్ ఫొటోలు ప్రతి ఇంట్లో ఉన్నాయని, ఆయన ఫొటో ప్రక్కనే సీఎం జగన్‌ ఫొటో పెట్టుకోని ప్రజలు పూజిస్తారని చెప్పారు. న్యాయ వ్యవస్థకు వైఎస్సార్‌సీపీ కట్టుబడి వుందని, న్యాయ వ్యవస్థను గౌరవిస్తుందని తెలిపారు. న్యాయ వ్యవస్థను అగౌరవపరిచే విధంగా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు.

మరిన్ని వార్తలు