తదుపరి చర్యలు చేపట్టకుండా ఏపీని ఆగమనండి

17 May, 2020 03:27 IST|Sakshi

కేఆర్‌ఎంబీకి ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి గజేంద్రసింగ్‌ వెల్లడి 

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ రాసిన లేఖకు స్పందన

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం పెంపున కు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, శ్రీశైలం నుంచి నీటిని తరలించేందుకు ఇతర ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, దీనిని కేంద్రం అడ్డుకోవాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఇటీవల రాసిన లేఖపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ స్పం దించారు. సదరు లేఖ అందిందని, దాన్ని తమ శాఖ పరిశీలిస్తోందని పే ర్కొంటూ శనివారం బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి లేఖ రాశారు. 

వెంటనే సమావేశం ఏర్పాటుచేయాలని, ఆ ప్రాజెక్టుల డీపీఆర్‌లను సాంకేతికంగా పరిశీలించాలని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)ను ఆదేశించినట్టు ఆ లేఖలో షెకావత్‌ పేర్కొన్నారు.  అలాగే ఏపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014లో పేర్కొన్న కృష్ణా నదీ జలాల నిర్వహణ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా అనేది తేలే వరకు ఈ ప్రాజెక్టుల విషయంలో తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌కు చెప్పాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. అలాగే, కృష్ణానది నీటి వినియోగానికి సంబంధించి రెండు రాష్ట్రాల చర్యలపై చర్చించేందుకు అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయాలని తమ శాఖ అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. 

ఇది తెలంగాణ విజయం: బండి సంజయ్‌ 
కేంద్రమంత్రి ఆదేశాలపై సంజయ్‌ సంతోషం వ్యక్తం చేశారు. తన లేఖకు స్పందించినందుకు కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. ఇది శుభపరిణామమని, తెలంగాణ ప్రజల విజయమని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు