‘గాలి’ ప్రచారానికి వీల్లేదు: సుప్రీం కోర్టు

4 May, 2018 14:40 IST|Sakshi
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: మైనింగ్‌ కింగ్‌, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి అనుమతించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బళ్లారి నియోజకవర్గంలో జనార్దన్‌ సోదరుడు  సోమశేఖర రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన తరపున బళ్లారిలో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాలి జనార్దన్‌ సిద్ధమయ్యాడు. ఈ మేరకు బెయిల్‌ నిబంధనలను సడలిస్తూ 10 రోజులు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శుక్రవారం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు దానిని తిరస్కరించింది. మైనింగ్‌ కేసులో గాలికి సుప్రీంకోర్టు షరతులతో కూడా బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బళ్లారి ప్రాంతానికి వెళ్లకూడదన్న నిషేధాజ్ఞల నేపథ్యంలో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు మాత్రం అందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. 

మరిన్ని వార్తలు