గల్లా అనుచరుల దాష్టీకం

21 Jul, 2019 08:50 IST|Sakshi
గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్త అక్రమ్, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, నారా లోకేశ్‌తో షబ్బీర్‌ (ఫైల్‌)

గుంటూరు ఆటోనగర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై హత్యాయత్నం

పాత లారీ కొనుగోలు విషయంలో వివాదం

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

గతంలోనూ ఓ వ్యాపారిపై హత్యాయత్నం

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగని ఆగడాలు

సాక్షి, గుంటూరు: గుంటూరులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అనుచరులు, ఆ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. ఆటోనగర్‌లో మామూళ్లు వసూలుచేస్తూ రెచ్చిపోతున్నారు. తమ అక్రమాలను ప్రశ్నించిన వారిని టార్గెట్‌ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా.. తమ అక్రమాలను నిలదీశారనే కారణంతో పాత లారీ కొనుగోలు విషయంలో తగాదా పెట్టుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త అక్రమ్‌పై ఎంపీ గల్లా అనుచరులు ఇంతియాజ్, రియాజ్, ఫెరోజ్, గఫూర్‌ శనివారం హత్యాయత్నం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. టీడీపీకి చెందిన ఆటోనగర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సయ్యద్‌ షబ్బీర్‌ ఎన్నికల ముందు అప్పటి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఇతర మంత్రుల సమక్షంలో గల్లా ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. టీడీపీ నాయకుడిగా చలామణీ అవుతున్న షబ్బీర్‌.. గత కొన్ని రోజులుగా  తన అనుచరులతో ఆటోనగర్‌లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు.

ఆటోనగర్‌లో  మరమ్మతుల కోసం వచ్చే లారీకి రూ.500, కారుకు రూ.300 చొప్పున వసూలు చేస్తున్నాడు. కాగా, ఇక్కడే స్పేర్‌పార్ట్స్‌ వ్యాపారం చేస్తున్న వైఎస్సార్‌సీపీకి చెందిన మురాద్‌ అలీ.. షబ్బీర్, అతని అనుచరుల ఆగడాలను తొలి నుంచి ప్రశ్నిస్తూ వస్తున్నాడు. దీంతో మురాద్‌ అలీపై షబ్బీర్, అతని అనుచరులు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆటోనగర్‌లో జానీ అనే వ్యాపారి రాజమండ్రిలో పాత లారీ కొనుగోలు చేసిన విషయంలో సంబంధం లేకపోయినప్పటికీ షబ్బీర్‌ కుమారులు, అనుచరులు మురాద్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మురాద్‌పై షబ్బీర్‌ తనయుడు కత్తితో దాడికి యత్నించాడు. దీంతో మురాద్‌ సోదరుని కుమారుడు అక్రమ్‌ ప్రతిఘటించడంతో అతని కుడి భుజానికి తీవ్ర గాయమైంది. గొడవ అనంతరం షబ్బీర్‌ అనుచరులు చాలాసేపు ఆటోనగర్‌లో కత్తులు, రాడ్లతో హడావుడి చేశారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న పెదకాకాని పోలీసులు అక్రమ్‌ను జీజీహెచ్‌కు తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా, దాడి చేసిన వారిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో స్వల్పంగా గాయపడ్డ షబ్బీర్‌ను కూడా ఆస్పత్రికి తరలించారు.

ఎంపీ అండదండలతోనే..  
ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం అల్తాఫ్‌ అనే వ్యాపారిపై కూడా షబ్బీర్, అతని కుమారులు, అనుచరులు హత్యాయత్నం చేశారు. ఈ కేసు విషయంలో అప్పటి సీఐ, హెడ్‌కానిస్టేబుళ్లు షబ్బీర్‌కు సహకరించడంతో బాధితుడు అల్తాఫ్‌ అర్బన్‌ ఎస్పీకి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ఆటోనగర్‌లో షబ్బీర్, అతని అనుచరుల అరాచకాలు తగ్గడంలేదు. టీడీపీ ఎంపీ గల్లా అండదండలతోనే వారు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, నారా లోకేశ్‌తో  షబ్బీర్‌ (ఫైల్‌).
 గాయపడ్డ వైఎస్సార్‌సీపీ కార్యకర్త అక్రమ్‌

మరిన్ని వార్తలు