ఇక చాలు..

16 Nov, 2018 02:59 IST|Sakshi

రిటైర్మెంట్‌ ప్రకటించిన రాజకీయ యోధుడు

దేశంలోనే సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేగా ఉన్న గణపతిరావు దేశ్‌ముఖ్‌ రాజకీయాల నుంచి సెలవు తీసుకున్నారు. మహారాష్ట్రలో 59ఏళ్ల పాటు శాసనసభ్యుడిగా కొనసాగిన ఈ 92 ఏళ్ల రాజకీయ యోధుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదంటూ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. 1962లో  సోలాపూర్‌ జిల్లా సంగోలా నుంచి మార్క్సిస్ట్‌ పెజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ (పీడబ్ల్యూపీ) టికెట్‌పై తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వరసగా 11 సార్లు ఆ పార్టీ తరఫునే అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ప్రస్తుత మహారాష్ట్ర శాసనసభలో ముగ్గురు పీడబ్ల్యూపీ ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్న గణపతిరావు వయసు మీద పడినందున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం సాధ్యం కాదంటున్నారు. ద్రావిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, దివంగత మాజీ సీఎం ఎం.కరుణానిధి అత్యధికకాలం 61 ఏళ్ల పాటు  ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో పదకొండుసార్లు గెలుపొందడంతో పాటు 59 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న దేశ్‌ముఖ్‌నే సుదీర్ఘకాల ఎమ్మెల్యేగా నిలుస్తున్నారు. కరుణానిధి వరసగా 13 సార్లు గెలుపొందగా, దేశ్‌ముఖ్‌ 13 ఎన్నికల్లో పోటీచేసి 1972, 1995 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. 1995లో 192 ఓట్ల స్వల్ప తేడాతో ్జఓటమిని  చవిచూశారు.

 రైతులకు ఆయన.. ఆయనకు రైతులు
1978లో శరద్‌పవార్‌ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్‌ డెమొక్రాటిక్‌ అలయెన్స్‌ ప్రభుత్వంలో పీడబ్ల్యూపీ చేరడంతో దేశ్‌ముఖ్‌ మొదటిసారి మంత్రి అయ్యారు. 1999లో కాంగ్రెస్‌–ఎన్‌సీపీ సర్కార్‌కు పీడబ్ల్యూపీ మద్దతు తెలిపినపుడు రెండోసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. నీటి కొరత ప్రధాన సమస్యగా మారడంతో టెంభూ నీటిపారుదల ప్రాజెక్టు సాధనలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సంగోలలోని 50 వేల ఎకరాలు సాగులోకి వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.

‘ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. రైతుల సంపూర్ణ సహకారంతోనే ఆయన గెలుస్తూ వచ్చారు’ అని రాజకీయపరిశీలకుడు కిషోర్‌ కులకర్ణి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారానికయ్యే ఖర్చును భరించేంత స్థోమత లేకపోవడంతో కార్యకర్తలు సేకరించిన విరాళాలతోనే ఇప్పటివరకు నెట్టుకొచ్చినట్టు దేశ్‌ముఖ్‌ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు