గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ చీఫ్‌ కావచ్చు కానీ..

23 Jun, 2019 20:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడు కావచ్చు కానీ, పార్టీపై మాత్రం ఆ కుటుంబం పట్టు కోల్పోకుండా ఉండాలని ఆ పార్టీ సీనియర్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ అన్నారు. కాంగ్రెస్ తదపరి అధ్యక్షునిగా రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ను నియమిస్తారంటూ.. వస్తున్న వ్యాఖ్యలపై  ఆయన స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఉంటే మంచిదే గానీ, ఆయన అభిప్రాయాలను సైతం గౌరవించాల్సిన అవసరం కార్యకర్తలకు, నాయకులకు ఉందని సూచించారు. గాంధీ, నెహ్రూ కుటుంబాలు అధ్యక్ష పదవిలో లేకున్నా పార్టీ ప్రజల్లో బలంగా ఉంటుందన్నారు.

పార్టీలో క్లిష్ట పరిస్థితులు తలెత్తినపుడు, నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తితే మాత్రం వాటిని పరిష్కరించే సత్తా మాత్రం గాంధీ కుటుంబానికే ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహులే కొనసాగుతారా? లేక అశోక్‌కు అప్పగిస్తారా? అన్న దానికి వేచి చూడాల్సిందేనని మణి శంకర్ బదులిచ్చారు. మొదట గాంధీ ముక్త్ కాంగ్రెస్ కావాలని బీజేపీ ప్రయత్నించిందని, తద్వారా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటోదని విమర్శించారు.

మరిన్ని వార్తలు