యడ్డి సొంత నిర్ణయాలకు బ్రేక్!

22 Sep, 2019 16:14 IST|Sakshi
కర్ణాటక సీఎం బీఎస్‌ యడియూరప్ప

సీఎం సలహాదారుగా సంఘ్‌ నేత నియామకం

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. యడ్డీకి బ్రేక్‌ చెప్పేందుకు ఇప్పటికే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించిన కేంద్ర నాయత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సలహాదారుగా సంఘ్‌నేత గణేష్‌ కార్నిక్‌ను నియమించింది. మాజీ ఎమ్మెల్సీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖునిగా పేరున్న గణేష్‌ కార్నిక్‌ త్వరలోనే ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. త్వరలో జరిగే కేబినెట్‌ సమావేశంలో కార్నిక్‌ నియామకాన్ని ఆమోదించనున్నారు. కాగా ఈ పరిణామం యడియూరప్పను కొంత ఇబ్బంది పెట్టేదే అని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.

యడ్డీపై నమ్మకం లేకనే ఇలా సంఘ్‌నేతని సీఎం సలహాదారుడిడి నియమించినట్లు తెలిసింది. కార్నిక్‌ అనుమతి లేకుండా యడియూరప్ప ఒక్క పేపర్‌పై  కూడా సంతకం చేయరాదని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. కాగా యడ్డీ ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అమిత్‌ షా హిందీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో దృష్టిలో ఉంచుకున్న కేంద్ర పెద్దలు యడియూరప్ప సొంతంగా ముఖ్య నిర్ణయాలు తీసుకోకుండా అరికట్టేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.   

ప్రతి ఫైలూ ఆయన చూశాకే  
పార్టీ నాయకత్వం గణేష్‌ను సీఎం పేషీలోకి పంపడం ప్రత్యేకత చోటుచేసుకుంది. మంగళూరు ప్రాంతానికి చెందిన ఈయనను తేవడం వెనుక అనేక లెక్కాచారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో యడియూరప్ప సంతకం చేసే ప్రతి ఫైల్‌ గణేష్‌ కార్నిక్‌ పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాతనే సీఎం వద్దకు వెళ్తుందని సమాచారం. ఆయనకు ప్రత్యేక అధికారాలతో పాటు అధికారుల బదిలీలు, నియామకాలు, కేఐఏడీబీ ద్వారా వ్యాపారవేత్తలకు భూములను ఇవ్వడం, డి నోటిఫికేషన్‌కు సంబంధించిన అంశాలను కార్నిక్‌ పరిలించాకే సీఎం సంతకం చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు