టెంట్‌ కనపడితే చాలు ఉడుముల్లాగా చేరిపోతున్నారు!

13 Oct, 2019 13:00 IST|Sakshi

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ‍మ్యానిఫెస్టోలో చెప్పలేదు

సాక్షి, కరీంనగర్‌ : బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఎక్కడ టెంట్‌ కనపడితే అక్కడ ఉడుముల్లాగా చేరి.. ఆర్టీసీ కార్మికులను తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ విమర్శించారు. ఆదివారం జిల్లాలో మంత్రి కమలాకర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెతో ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  డిమాండ్ల కోసం చేపట్టిన ఆర్టీసీ సమ్మెను కొంతమంది సీఎం కేసీఆర్‌పై తమకున్న ఈర్ష్యను తీర్చుకునేందుకు ప్రయత్రిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల్లో అంతర్మథనం మొదలైందని, యూనియన్‌ నాయకుల వెనుక ఒక్కో రాజకీయ పార్టీ ఉందని పేర్కొన్నారు. కార్మికుల 26 డిమాండ్లలో యూనియన్‌ నాయకులు కేవలం విలీనంపైనే ఎందుకు పట్టుబట్టి కూర్చున్నారని నిలదీశారు. ఏ రోజూ స్టీరింగ్‌ పట్టని యూనియన్‌ నేతలు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కావాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల అభిప్రాయ పడ్డారు.

ఆర్టీసీ విలీనంపై సీఎం కేసీఆర్‌ మెనిఫెస్టోలో పెట్టలేదని గంగుల స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏపీతో పోల్చడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో ఆర్టీసీని విలీనం చేస్తారా అని ప్రశ్నించారు. మొదట తమ ప్రాంతాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఆందోళనలు చేయాలని, ఆ తరువాత తెలంగాణ గురించి మాట్లాడలని తెలిపారు. తమ దగ్గరికి వచ్చే రాజకీయ నాయకులను కార్మికులు ఈ విషయంలో నిలదీయాలని అన్నారు. ఏయిరిండియా, రైల్వే, బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేటీకరణకు చేస్తున్న కుట్రల సంగతేంటని, దీనిపై ముందు పార్లమెంటులో నిలదీయాలని ద్వజమెత్తారు. నాయకుల స్వలాభం కోసం కార్మికులను బలి చేస్తున్నారని, అశ్వత్థామ రెడ్డి వెనక ఏ పార్టీ ఉందో తెలుసుకోవాలని గంగుల కమలాకర్‌ కార్మికులను కోరారు.

అదే విధంగా ఐఆర్‌ ఫిట్‌మెంట్‌ రూంలో ఇప్పటికే 60 శాతం సీఎం కేసీఆర్‌ ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు.  కార్మికులను అడ్డుపెట్టుకొని రాజకీయంగా లబ్థిపొందాలనే నేతల కుట్రలు గమనించాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజా రవాణాను సీఎం నడిపిస్తే, పండగను అడ్డు పెట్టుకొని నాయకులు బ్లాక్‌మెయిల్‌ చేయాలని చూశారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుని ఆత్మహత్యామత్నానికి రాజకీయ నేతలు రెచ్చగొట్టడమే కారణమని విమర్శించారు. సీఎంపై అక్కసుతోనే ఆర్టీసీ సమ్మెను రాజకీయంగా వాడుకుంటున్నారని, సమ్మెకు ప్రజల మద్దతు లేదని, సమ్మె వెంటనే విరమించాలని తెలిపారు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోమని 2016 జూన్‌ 17న కార్మికులకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తమ జీవితాలను పణంగా పెట్టి రాజకీయాలు చేస్తున్న నేతల పట్ల కార్మికులు అప్రమత్తంగా ఉండాలని గంగుల సూచించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా