జనసేన సమావేశాల్లో గంటా బ్యాచ్‌?

18 May, 2018 12:48 IST|Sakshi

నగరంలో పవన్‌కల్యాణ్‌ మకాం

బస్సుయాత్రపై పార్టీశ్రేణులతో చర్చలు

ఆయనతో భేటీ అయిన మంత్రి సన్నిహితులు

టీడీపీ, జనసేనల్లో ఆసక్తికర చర్చలు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర బస్సు యాత్ర పూర్వరంగంలో నగరంలోనే మకాం వేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితులు భేటీ కావడం, జనసేన శ్రేణుల సమావేశాల్లోనూ ఆయన అనుచరులు పాల్గొనడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.. వాస్తవానికి ప్రజారాజ్యం పార్టీ మొదలు గంటాతో చిరంజీవి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. పీఆర్పీ నుంచి కాంగ్రెస్‌లోకి.. అటు నుంచి టీడీపీలోకి గంటా వెళ్లడం.. ఇటు జనసేన పెట్టి పవన్‌కల్యాణ్‌ గత ఎన్నికల్లో టీడీపీతో కలిసి ప్రచారం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో గంటా, పవన్‌ల సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అయితే పవన్‌ కల్యాణ్‌ ఇటీవల సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై విరుచుకుపడిన దరిమిలా జనసేనను టీడీపీ నేతలు, మంత్రులు టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. పవన్‌ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.

కానీ పవన్‌పై విమర్శల విషయంలో ఇప్పటివరకు వ్యూహాత్మకంగా  మౌనం పాటించిన మంత్రి గంటా ఇప్పుడు నగరంలోనే బస చేసిన పవన్‌తో తెరవెనుక మంత్రాంగం చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నెల 20న శ్రీకాకుళం నుంచి ఉత్తరాంధ్ర బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్న పవన్‌ బుధవారంరాత్రి నుంచి విశాఖలోనే బస చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ శ్రేణులతో విస్తృతంగా సమావేశమైన పవన్‌ కల్యాణ్‌ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితులు, అనుచరులు వెళ్లి కలవడం చర్చనీయాంశమైంది.  ఈ విషయమై ఎవరికివారు అదంతా ఉత్తిదే అని కొట్టిపారేస్తున్నా ఉదయం నుంచి అక్కడే కాపుకాసిన జనసేన శ్రేణులు మాత్రం అంతర్గత సంభాషణల్లో  గంటా బ్యాచ్‌ రాక వాస్తవమేనని అంగీకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు