వీజేఎఫ్‌ ముఖాముఖికి గంటా డుమ్మా

28 Mar, 2019 10:56 IST|Sakshi

సాక్షి, విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం అభ్యర్థుల ముఖాముఖికి డుమ్మా కొట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్‌ రాజు ఉంటే తాను రానని, మీడియా ముందు తన పరువు తీస్తారంటూ మంత్రి గంటా ముఖం చాటేశారు. ఈ మేరకు ఆయన వీజేఎఫ్‌ సభ్యులకు ఫోన్‌ ద్వారా తెలిపారు. కాగా విశాఖ నార్త్‌ నుంచి వైఎస్సార్ సీపీ నుంచి కేకే రాజు, బీజేపీ తరఫున విష్ణుకుమార్‌ రాజు, ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, జనసేన అభ్యర్థిగా పి. ఉషాకిరణ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా గోవిందరాజు బరిలో ఉన్న విషయం తెలిసిందే. వీజేఎఫ్‌ ముఖాముఖికి మిగతా వారంతా హాజరు కాగా, ఒక్క గంటా శ్రీనివాసరావు మాత్రం గైర్హజరు కావడం విశేషం. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌ రాజు మాట‍్లాడుతూ.. గంటా ముఖాముఖి కార్యక్రమానికి హాజరు కాకపోవడం నియోజకవర్గ ప్రజలను, వీజేఎఫ్‌ను అవమానపరచడమే అని అన్నారు. ఏపీలో బీజేపీది ఎప్పుడు ప్రతిపక్ష పాత్రేనన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. 

కాగా గంటా శ్రీనివాసరావు పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేయడంలో నెంబర్‌వన్‌ అని, ఓటును రూ.10వేలకు కొంటున్నారంటూ ....విష్ణుకుమార్‌ రాజు ఇప్పటికే ఘాటు విమర్శలు చేస్తున్నారు. అవినీతికి మరోపేరు అయిన గంటా పోలింగ్‌ ఏజెంట్లను కూడా కొనే ప్రమాదకర వ్యక్తి అని, ఆయన గెలుపు కోసం విచ్చలవిడిగా డబ్బులను పంచుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. గంటాను భీమిలి ప్రజలు వెళ్లగొడితే విశాఖపై వచ్చి పడ్డారని విష్ణుకుమార్‌ రాజు వ్యాఖ్యల నేపథ్యంలో గంటా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు