అమీ.. తుమీ

7 Apr, 2018 09:38 IST|Sakshi

డీఎల్‌డీఏ కోసం మంత్రుల సిగ‘పట్టు’

చోటుచేసుకున్న పరిణామాలపై వివరణ ఇచ్చుకోనున్న కలెక్టర్‌

నేడు ఇన్‌చార్జి మంత్రిచినరాజప్ప సమీక్ష

సాక్షి, విశాఖపట్నం: జిల్లా పశుగణాభివృద్ధి సంఘం కొత్త పాలకవర్గ ఎన్నిక వివాదం కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఇరువురు మంత్రులు అమీతుమీకి సిద్ధపడుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరుడైన గాడు వెంకటప్పడును డీఎల్‌డీఏ కొత్త చైర్మన్‌గా ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు పాతపాలకవర్గాన్ని కొనసాగించాలని తాను ఇచ్చిన సిఫారసు లేఖను పక్కన పెట్టి ఏవిధంగా ఎన్నికలు నిర్వహిస్తారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన సిఫారసు లేఖ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికార యంత్రాంగంపై సీఎంవోతో పాటు ఇన్‌చార్జి మంత్రి చినరాజప్పకు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌పై తీవ్రస్వరంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు కలెక్టర్‌ ఆఘమేఘాల మీద ఆ ఎన్నికను నిలుపుదల చేశారు.

మంత్రి లేఖ బయట పెట్టారన్న సాకుతో పశుసంవర్ధకశాఖ జేడీ కోటేశ్వరరావు, డీఎల్‌డీఏ ఈవో సూర్యప్రకాష్‌లను సరెండర్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కొత్త పాలకవర్గ ఎన్నిక కొలిక్కివచ్చే వరకు ఈవోతో పాటు చైర్మన్‌ బాధ్యతలను జేసీ–2 ఎ.సిరికి అప్పగించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిబంధనల మేరకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనా కొత్త చైర్మన్‌ గాడు వెంకటప్పడు బృందం న్యాయపోరాటానికి సిద్ధమైనప్పటికీ మంత్రి గంటాతో ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి విశాఖనగరానికి వచ్చిన గంటాతో వెంకటప్పడు బృందం బేటీ అయ్యేందుకు యత్నించినా మంత్రికున్న కార్యక్రమాల వల్ల వీలు పడలేదు. దీంతో శుక్రవారం ఉదయం మంత్రితో బేటీ అయి జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకే తమ ఎన్నికలు నిర్వహించారని, అలాంటప్పుడు మా ఎన్నిక చెల్లదనడం సరికాదని మంత్రి దృష్టికి తీసుకురానున్నారు.తమకు జరిగిన అన్యాయంపై చినరాజప్ప సమక్షంలో జరిగే సమావేశంలో చర్చించాలని కోరనున్నారు.ఈ వ్యవహారంపై మంత్రి గంటా కూడా సీరియస్‌గానే ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని అయ్యన్న పాత్రుడు వివాదం చేస్తున్నారని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

డీఎల్‌డీఏ పాత పాలకవర్గం ఇప్పటికే రెండు దఫాలు పనిచేసిందని, పైగా కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి చైర్మన్‌గా ఉన్న ఈ పాలకవర్గాన్ని ఇంకా కొనసాగించాలని సిఫారసు చేయడం పట్ల మంత్రి గంటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి సమక్షంలోనే చర్చించాలని భావిస్తున్నారు. మరో వైపు జరిగిన పరిణామాలు..తాను తీసుకున్న చర్యలపై కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ కూడా వివరణ ఇచ్చేం దుకు సిద్దమవుతున్నారు. సమీక్షలో డీఎల్‌డీఏపై ఇరువురు మంత్రులు సిగపట్లు çపడతారన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. అయితే సమీక్ష సందర్భంగా ఎలాంటి రచ్చ చేయొద్దని, పార్టీ కార్యాలయంలో కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ప్రతిపాదన చినరాజప్ప తెచ్చే అవకాశాలు కన్పిస్తు న్నాయి. సమీక్ష పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే జరగాలని, ఏదైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించుకుందామన్న ప్రతిపాదన పలువురు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారు. సమీక్ష అనంతరం పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. సమీక్షలో కాకున్నా పార్టీ సమావేశం లోనైనా రచ్చకెక్కిన ఈ అంశంపై చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలంటున్నారు.

మరిన్ని వార్తలు