గంభీరే అధిక సంపన్నుడు

25 Apr, 2019 10:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలోకి బీజేపీ తూర్పు ఢిల్లీ నుంచి అభ్యర్థిగా నిలబెట్టిన మాజీ ఇండియన్‌ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అతి సంపన్నుడు. తనకు రూ.147 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన నామినేషన్‌ పత్రాలతో పాటు దాఖలుచేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన క్రికెటర్‌ గంభీర్‌ 2017–18 ఆదాయ పన్ను రిటరŠన్స్‌లో రూ.12.40 కోట్ల ఆదాయమున్నట్లు చూపారు. గంభీర్‌ భార్య నటాషా తన ఇదే ఆర్థిక సంవత్సరపు ఆదాయ పన్ను రిటర్న్స్‌లో రూ.6.15 లక్షల ఆదాయం ఉన్నట్లు తెలిపారు. తన వద్ద రూ.116 కోట్ల విలువైన చరాస్తులు, రూ.28 కోట్ల స్థిరాస్తులు, రూ.34.20 కోట్ల రుణాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. బారాఖంబా మోడర్న్‌ స్కూలు, ఢిల్లీ యూనివర్సిటీ హిందూ కాలేజీలో చదువుకున్న గంభీర్‌ తనపై చీటింగ్‌కు సంబంధించిన క్రిమినల్‌ కేసు కూడా ఉందని ప్రకటించారు.

మనోజ్‌ తివారీ ఆస్తులు రూ.24 కోట్లు..
ఈశాన్య ఢిల్లీ నుంచి çపోటీచేస్తున్న ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ తనకు మొత్తం రూ.24 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌తో పోలిస్తే ఆయన ఆస్తులు రూ.4 కోట్లు పెరిగాయి. 2017–18 ఆదాయ పన్ను రిటరŠన్స్‌లో ఆయన ఆయన రూ.48.03 లక్షల ఆదాయం చూపారు. 2014 ఎన్నికల సమయంలో ఆయన తనకు రూ.85 లక్షల ఆదాయం ఉందని పేర్కొన్నారు. దక్షిణ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి రమేష్‌ బిధూడీ రూ.18 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. గత ఐదు సంవత్సరాలలో ఆయన ఆస్తులు రూ.3.5 లక్షలు పెరిగాయి. తనకు రూ.16.72 లక్షలు, తన భార్యకు రూ.3.09 లక్షలు ఆదాయం, తనపై ఆధారపడిన హిమాంశుకు రూ.3.17 లక్షల ఆదాయం ఉందని ఆయన 2017–18లో దాఖలుచేసిన దాయ పన్ను రిటరŠన్స్‌లో తెలిపారు. బిధూడీ తనకు రూ.1.40 కోట్ల చరాస్తులు, రూ.11.80 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని, తన భార్యకు రూ.13.21 లక్షల విలువైన నగదు, బంగారం, రూ.4.57 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు. రూ.20.38 లక్షల రుణాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

బిధూడీకి వ్యతిరేకంగా దక్షిణ ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తనకు రూ.3.57 కోట్ల స్థిరాస్తులు, రూ.5.05 కోట్ల చరాస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఈశాన్య ఢిల్లీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ తనకు రూ.4.92 కోట్ల వ్యక్తిగత ఆస్తులున్నట్లు తెలిపారు. నిజాముద్దీన్‌లో ఉన్న అపార్ట్‌మెంట్‌ తనదేనని, దాని విలువ రూ.1.88 కోట్లు ఉంటుందని ఆమె తెలిపారు. పంజాబీ గాయకుడు, బీజేపీ వాయవ్య ఢిల్లీ అభ్యర్థి హన్స్‌ రాజ్‌ హన్స్‌ 2017–18 ఆదాయ పన్ను రిటరŠన్స్‌లో రూ.9.28 లక్షల ఆదాయం చూపారు. తనకు రూ.1.44 కోట్ల విలువైన చరాస్తులు, రూ.11.48 కోట్ల విలువైన స్థిరాస్తులు, తన భార్యకు రూ.18.50 లక్షల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. రూ.23.98 లక్షల రుణాలున్నాయని ప్రకటించారు. తనకు టయోటా ఇన్నోవా, ఫోర్డ్‌ ఎండీవర్, మారుతీ జిప్పీ వాహనాలు ఉన్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు